
వర్షాకాలంలో ఒక మెంతి లడ్డూ తింటే చాలు ఇది ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు, అజీర్తిని దూరం చేయడమే కాకుండా, చలి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అయితే దీనిని తయారు చేయడానికి ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు చూసేద్దాం. కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మెంతులు , గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, సుంఠి పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్, బాదం.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. అందులో మెంతులు వేసి లోఫ్లేమ్‌లో తక్కువ మంటపై బంగారు రంగు వచ్చే వరకు వేయింకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టి, మెత్తని పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. దీనిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

అదే పాన్‌లో కొంచెం నెయ్యి వేసి, అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదం వేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత బెల్లం పాకం తయారు చేసుకోవాలి. బెల్లం పాకం కోసం రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి మంచిగా మరగబెట్టాలి. నీరు వేడి అయిన తర్వాత అందులో బెల్లం వేయాలి.

బెల్లం బాగా కరిగేలా మంచిగా కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగి పాకం రావాలి. అది తీగ పాకం వచ్చిన తర్వాత అందులో వేయించిన గోధుమ పిండి, మెంతి పొడి , సుంఠి పొడి, యాలకుల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఇక ఇది బాగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చేసి లడ్డూల్లా చుట్టుకోవాలి.

అంతే ఆరోగ్యాన్ని ఇచ్చే మెంతుల లడ్డూలు రెడీ. దీనిని ప్రతి రోజూ ఉదయం ఒకటి తింటే చాలు ఇది డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. నోట్ : పై సమచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరింగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.