
నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ నిమ్మకాయలు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన పండు అని అమెరికాలోని విలియం పాటర్సన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, శరీరాన్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.

గ్యాస్ట్రిటిస్ సమస్యలు: అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అవును వైద్యుల ప్రకరాం.. గ్యాస్ట్రిటిస్, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వారికి గుండెల్లో మంట, కడుపు నొప్పి, వికారం కలిగిస్తుంది.

తలనొప్పి ఉన్నవారు: తలనొప్పి వంటి సమస్యలు ఉన్నవారికి నిమ్మకాయ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఉండే టైరమైన్ సమ్మేళనం మైగ్రేన్ లేదా తలనొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ రసం తీసుకుంటే కొన్ని సార్లు చర్మంపై దురద లేదా శ్వాస సమస్యలు వంటి అలెర్జీకి కూడా గురికావచ్చు.

ఖాళీ కడుపుతో తాగడం: చాలా మందికి ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగే అలవాటు ఉంటుంది. ఇది మితంగా తీసుకుంటే ఒకే. కానీ ఈ డ్రింక్ ఎక్కువగా తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. అందువల్ల, సగం నిమ్మకాయను నీటితో కరిగించి భోజనంతో లేదా భోజనం తర్వాత త్రాగడం మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రోజుకు ఒకటి లేదా రెండు గ్లాస్‌లకు మించి నిమ్మకాయ నీటిని తాగకండి.

NOTE: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించండి.