
రెక్కలపై భయంకరమైన గుడ్లగూబ కళ్లు.. చూడగానే పాము ముఖాన్ని తలపించే వింత రూపం.. మొదటిచూపులోనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ కీటకం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామంలో ప్రత్యక్షమైన ఈ వింత జీవిని చూసి ప్రజలు తొలుత కంగారుపడినప్పటికీ, ఇది మానవాళికి ఎలాంటి హాని చేయని ఇండియన్ ఓలెట్ మాత్ అని జీవశాస్త్ర నిపుణులు స్పష్టం చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

ప్రకృతి ఒడిలో తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ కీటకం ప్రదర్శించే వినూత్న రక్షణ తంత్రం అత్యంత అద్భుతమైనది. సీతాకోకచిలుకల (మాత్) జాతికి చెందిన ఈ జీవులు ప్రధానంగా భారతదేశం, శ్రీలంక దేశాల్లో విస్తరించి ఉంటాయి. శత్రువుల నుంచి, ముఖ్యంగా తమను వేటాడే పక్షుల బారిన పడకుండా తప్పించుకోవడానికి ప్రకృతి దీనికి ఒక సహజ రక్షణ కవచాన్ని ప్రసాదించింది.

రెక్కలపై ఉండే పెద్దటి కళ్ల గుర్తులు, శత్రు జీవులకు ఇదొక ప్రమాదకరమైన పెద్ద ప్రాణి అనే భ్రమను కలిగిస్తాయి. దాంతో వేటాడే పక్షులు భయపడి వెనుతిరిగిపోతాయి. బయటకు భయంకరంగా కనిపించినప్పటికీ, పర్యావరణ వ్యవస్థలో ఈ ‘ఇండియన్ ఓలెట్ మాత్’ పోషించే పాత్ర ఎంతో ప్రశంసనీయమైనది.

రాత్రివేళల్లో మాత్రమే సంచరించే ఈ నిశాచర కీటకాలు, చీకట్లో వికసించే సువాసనల పూలు, వివిధ రకాల కూరగాయల మొక్కల వైపు ఆకర్షితమవుతాయి. ఆయా పువ్వుల్లోని మకరందాన్ని గోలుతూ ఒక పువ్వు నుండి మరో పువ్వుకు ప్రయాణించడం ద్వారా ఇవి పరాగ సంపర్క ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.

పగటిపూట పొదలు, చెట్ల నీడల్లో నిగూఢంగా దాక్కుని, రాత్రివేళల్లో వృక్షజాల విస్తరణకు, ప్రకృతి సమతుల్యతకు నిశ్శబ్దంగా తోడ్పడే ఇటువంటి కీటకాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవశాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి పర్యావరణ మిత్రులని, వీటిని చూసి భయపడి చంపకుండా సంరక్షించడమే ప్రకృతికి మనం చేసే మేలని వారు సూచిస్తున్నారు.