
బరువు తగ్గాలనుకునే వారికి జొన్న ఇడ్లీలు ఒక అద్భుతమైన అల్పాహారం. జొన్నల్లో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియకు సహాయపడి, ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. మెత్తని, స్పాంజీ జొన్న ఇడ్లీలను సులువుగా ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో, వివరంగా తెలుసుకుందాం. జొన్న ఇడ్లీల తయారీకి కావలసినవి: జొన్నలు: 2 కప్పులు (తెల్ల జొన్నలు లేదా పచ్చ జొన్నలు), వేసుకోవాలనుకుంటే మినప్పప్పు: అర కప్పు, మెంతులు: అర టీ స్పూన్, అటుకులు: అర కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి దీనిని తీసుకోవాలి.

ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్పుల జొన్నలను తీసుకుని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. మరొక గిన్నెలో అర కప్పు మినప్పప్పు, అర టీ స్పూన్ మెంతులు తీసుకుని కడిగి నీళ్లను పోయాలి. జొన్నలు, మినప్పప్పు మిశ్రమాన్ని నాలుగు నుంచి ఐదు గంటల పాటు బాగా నానబెట్టాలి. పిండి రుబ్బడానికి ముందు, ఒక గిన్నెలో అర కప్పు అటుకులను తీసుకుని కడిగి, ఐదు నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఇది ఇడ్లీలకు మెత్తదనాన్ని ఇస్తుంది.

నానిన పప్పును, అటుకులను మిక్సీ జార్‌లోకి లేదా గ్రైండర్‌లో వేసి, అవసరానికి సరిపడా నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే మిక్సీ జార్‌లోకి నానిన జొన్నలను తీసుకుని, కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా రవ్వ రవ్వగా (బరకగా) రుబ్బుకోవాలి. జొన్నలను బరకగా రుబ్బడం వల్ల ఇడ్లీలు గట్టిగా రాకుండా, స్పాంజీగా తయారవుతాయి.

రుబ్బిన జొన్న పిండిని మినప్పప్పు పిండితో కలిపి బాగా కలపాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలిపి సర్దుబాటు చేసుకోవచ్చు. ఈ పిండిని రాత్రంతా పులియబెట్టాలి. బాగా పులిసిన పిండి ఇడ్లీలకు చక్కని రుచిని, మెత్తదనాన్ని ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం, పిండి చక్కగా పులిసి ఉంటుంది. పిండిని ఒకసారి బాగా కలిపి, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్లీ కలపాలి. పిండి గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు.

ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి లేదా నీటితో తడిపి, పిండిని నింపాలి.ఇడ్లీ పాత్రలో గ్లాసున్నర నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, ఇడ్లీ స్టాండ్‌ను అందులో ఉంచి మూత పెట్టి, పది నుంచి పన్నెండు నిమిషాల పాటు అధిక మంటపై ఉడికించాలి. ఇడ్లీలు ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆపి మూత తీయకుండా, మూతను కొద్దిగా తెరిచి ఐదు నిమిషాలు అలానే ఉంచాలి. దీనివల్ల ఇడ్లీలు గట్టిపడకుండా, సులువుగా ప్లేట్ల నుండి ఊడి వస్తాయి. ఆ తర్వాత స్పూన్‌తో లేదా చేత్తో తీయాలి. ఇలా చేసిన జొన్న ఇడ్లీలు చాలా మెత్తగా, స్పాంజీగా వస్తాయి.