
జొన్న సంగటి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడే వారికి ఇది బెస్ట్ ఫుడ్. ప్రతి రోజూ వీరు తమ ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి, డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

జొన్న సంగటి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : జొన్నలు ఒక కప్పు, నీళ్లు నాలుగు నుంచి, ఐదు కప్పులు, ఉప్పు రుచికి సరిపడ, కొంచెం మిరియాల పొడి.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా జొన్నలు తీసుకోవాలి. మీరు సంగటి తయారు చేసుకోవడానికి ఒక రోజు ముందే రాత్రి సమయంలో వీటిని శుభ్రంగా కడిగి, నాన బెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో పైన చెప్పిన కొలతల ప్రకారం నీళ్లు పోయాలి. అలాగే అందులో మిరియాల పొడి చిటికెడు, ఉప్పు వేసి నీరు బాగా మరిగేలా చూసుకోవాలి. నీరు బాగా మరిగి, పొంగులా వస్తున్న సమయంలో అందులో మనం మిక్సీ పట్టుకున్న జొన్న మిశ్రమం వేసి కంటిన్యూగా కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి.

కనీసం పది నిమిషాల వరకు దానిని మంచిగా ఉడక బెట్టాలి. కలుపుతూ ఉండటం వలన ఉండలు కట్టకుండా, గట్టిపడకుండా ఉంటుంది. ఇక ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నం తీసుకొని దానిని మెత్తగా స్మాష్ చేయాలి. తర్వాత జొన్న మిశ్రమం, వేడి వేడి అన్నం మిక్సీ చేసి, చేతికి నెయ్యి రాసుకొని ముద్దలా తయారు చేసుకోవాలి. అంతే జొన్న సంగటి రెడీ.