
ఉల్లిపాయలలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసినప్పటికీ.. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఐరన్, కాల్షియంను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. వీటిలో ఉండే 'సైనోజెనిక్ గ్లైకోసైడ్లు' పరిమితికి మించితే ఆరోగ్యానికి ముప్పు కలిగించే అవకాశం ఉంది.

ఉల్లిపాయల్లో FODMAPలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందరికీ సులభంగా జీర్ణం కావు. ముఖ్యంగా..జీర్ణకోశ వ్యాధులు ఉన్నవారిలో పచ్చి ఉల్లిపాయలు గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు తిమ్మిర్లకు దారితీస్తాయి. ఆరోగ్యవంతుల్లో కూడా అతిగా పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల గుండెల్లో మంట ఏర్పడే అవకాశం ఉందని న్యూట్రియంట్స్ జర్నల్ పరిశోధనలు చెబుతున్నాయి.

ఉల్లిపాయలు భూమి లోపల పెరుగుతాయి కాబట్టి నేలలో ఉండే సూక్ష్మక్రిములు వీటిపై ఉండే అవకాశం ఉంది. పచ్చి ఉల్లిపాయలను సరిగ్గా కడగకుండా తింటే టేప్‌వార్మ్ వంటి పరాన్నజీవులు మన శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇవి అరుదైన సందర్భాల్లో మెదడుపై ప్రభావం చూపే సిస్టిక్ సిర్రోసిస్ వంటి తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాల వల్ల అది తిన్న తర్వాత శ్వాసలో మరియు శరీరంపై ఒక రకమైన ఘాటైన వాసన చాలా సేపు ఉండిపోతుంది.

పరిష్కారం ఏమిటి?: ఉల్లిపాయలను పూర్తిగా మానేయాల్సిన పనిలేదు, కానీ వాటిని తీసుకునే పద్ధతి మార్చుకోవాలి. ఉల్లిపాయలను ఉడికించడం వల్ల వాటిలోని సూక్ష్మక్రిములు, పరాన్నజీవులు నశిస్తాయి. వండిన ఉల్లిపాయలు జీర్ణం కావడం సులభం, ఇవి పేగు సమస్యలను తలెత్తనివ్వవు. వండటం వల్ల యాంటీ-న్యూట్రియంట్స్ ప్రభావం తగ్గి, శరీరం పోషకాలను బాగా గ్రహిస్తుంది.

వంటకు రుచిని ఇచ్చే ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేయాలంటే, వాటిని పచ్చిగా కంటే వండి తీసుకోవడమే ఉత్తమమని నిపుణుల సలహా. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.