
ఢిల్లీ MCDకి చెందిన డాక్టర్ అజయ్ కుమార్ విశ్లేషణ ప్రకారం.. మధ్యాహ్నం పూట 20 నుండి 30 నిమిషాల పాటు తీసుకునే చిన్న నిద్ర మెదడుకు ఎంతో విశ్రాంతినిస్తుంది. చిన్న విశ్రాంతి వల్ల పని సామర్థ్యం, ఏకాగ్రత మెరుగుపడతాయి. రాత్రి నిద్ర సరిగ్గా లేని వారికి లేదా శారీరక శ్రమ అధికంగా చేసే వారికి ఈ చిన్న నిద్ర రీఛార్జ్‌లా పనిచేస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచి, మిగిలిన రోజంతా ఉత్సాహంగా గడిపేలా చేస్తుంది.

గంట దాటితే ముప్పే: మధ్యాహ్నం నిద్ర ప్రయోజనకరమే అయినప్పటికీ అది గంట దాటితే మాత్రం అనర్థాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గంట కంటే ఎక్కువ నిద్రపోతే లేచిన తర్వాత తలనొప్పి, బద్ధకం, శరీరం బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి.

మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిపూట నిద్ర పట్టడం కష్టమవుతుంది. ఇది మీ జీవక్రియను దెబ్బతీస్తుంది. ఇది అలవాటుగా మారితే శారీరక శ్రమ తగ్గి, క్రమంగా సోమరితనం పెరుగుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట నాణ్యమైన నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట తక్కువగా, తేలికగా ఉండే ఆహారం తీసుకోవాలి. కెఫీన్ వాడకం తగ్గించాలి. పడకగది ప్రశాంతంగా, వెలుతురు లేకుండా చూసుకోవాలి.

మధ్యాహ్నం నిద్రపోవాలి అనుకుంటే కేవలం 20-40 నిమిషాలకే పరిమితం అవ్వండి. అది మీ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండాలి తప్ప, నిద్రనే ఒక వ్యసనంగా మార్చుకోకూడదని గుర్తుంచుకోండి.