
మర్చ్ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా "మహిళలు, అమ్మాయిలందరికీ హక్కులు, సమానత్వం, సాధికారత" అనే థీమ్‌ను ఎంచుకున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున గతంలో వాళ్లు సాధించిన విషయాలను ఒకసారి స్మరించుకుంటే.. మహిళలంటే ఏంటో మరోసారి పురుషులకు బోధపడుతుంది. అలాగే మహిళలకు గతంలో తాము ఏం సాధించామో కూడా ఒకసారి తెలుస్తుంది. అందుకే భారత దేశానికి రక్షణగా నిలుస్తూ.. దేశాన్ని రక్షించే ఆడ సింహాల్లా.. భారత వైమానిక దళంలో చేరిన మొట్టమొదటి ముగ్గురు మహిళా ఫైటర్ పైలట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గతేడాది అవని చతుర్వేది, భావన కాంత్, మోహనా సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్ పైలట్ శిక్షణ పొందిన మొదటి మహిళలుగా చరిత్ర సృష్టించారు.

భారత సాయుధ దళాలలో మహిళల ప్రాతినిధ్యం పెంచడంలో అవని చతుర్వేది, భావనా కాంత్, మోహనా సింగ్‌లు విప్లవాత్మకమైన ముందడుగు వేశారని చెప్పవచ్చు. స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ భారతదేశంలోని స్వదేశీ 'మేడ్ ఇన్ ఇండియా' LCA తేజస్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను నిర్వహిస్తున్న ఎలైట్ 18 'ఫ్లయింగ్ బుల్లెట్స్' స్క్వాడ్రన్‌లో చేరిన మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయ్యారు. స్క్వాడ్రన్ లీడర్లు భావనా కాంత్, అవని చతుర్వేది ప్రస్తుతం Su-30 MKI ఫైటర్ జెట్‌లను నడుపుతున్నారు. 2016లో, అవని చతుర్వేది, భావన కాంత్‌లతో కలిసి మోహనా సింగ్, భారత వైమానిక దళం ఫైటర్ పైలట్ ప్రోగ్రామ్‌లోకి ప్రవేశించిన మొదటి మహిళలు. వీరి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి.

జనవరి 1992లో రాజస్థాన్‌లోని ఝుంఝునులో జన్మించిన మోహనా సింగ్ సైనిక కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి ప్రతాప్ సింగ్ జితర్వాల్, రిటైర్డ్ IAF మాస్టర్ వారెంట్ ఆఫీసర్, ఆమె తాతకు మరణానంతరం వీర్ చక్ర లభించింది. 2019లో మోహనా సింగ్ హాక్ Mk.132 అడ్వాన్స్‌డ్ జెట్ ట్రైనర్‌లో శిక్ష పూర్తి చేసుకుని IAFలో మొదటి మహిళా ఫైటర్ పైలట్ అయ్యారు. అప్పటికి ఆమె 380 గంటలకు పైగా జెట్‌ను నడిపి ఔరా అనిపించారు. ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ పోరాట మోడ్‌లలో ప్రావీణ్యం సంపాదించారు.

గణతంత్ర దినోత్సవ కవాతులో భారత వైమానిక దళ బృందంలో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్ పైలట్ భావనా కాంత్. ఆమె నవంబర్ 2017లో ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరారు. మార్చి 2018లో మిగ్-21 బైసన్‌లో మొదటి సారి ఒంటరిగా నడిపారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ సెక్టార్‌లోని ఫైటర్ బేస్‌లో నియమితులయ్యారు.

మిగ్ 21 బైసన్‌ను ఒంటరిగా నడిపిన తొలి భారతీయ మహిళగా అవని చతుర్వేది చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాకు చెందిన అవని డియోలాండ్ అనే చిన్న పట్టణంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, రాజస్థాన్‌లోని బనస్థలి విశ్వవిద్యాలయం నుండి టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఈ సమయంలో ఆమె ఫ్లయింగ్ క్లబ్‌లో చేరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత మన హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అవని సోదరుడు కూడా ఆర్మీలోనే ఉన్నారు. ఫైటర్ జెట్ పైలెట్ అయ్యేందుకు అతనే అవనికి స్ఫూర్తిగా నిలిచాడు. అవని 1993 అక్టోబర్ 27న జన్మించారు. ఆమె తండ్రి దినకర్ చతుర్వేది మధ్యప్రదేశ్ ప్రభుత్వ జల వనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తల్లి గృహిణి.