
వర్షాల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎగిరి గంతేసే వార్త చెప్పింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో ఏర్పడిన అల్పపీడనం.. కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది.

వర్షాలు పడే జిల్లాలు ఇవే: రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. అలాగే కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు.. అటు రాయలసీమలోని అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇతర జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణలో వాతావరణం ఇలా: ఇదిలా ఉండగా అటు తెలంగాణ వాసులకు కూడా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న రైతన్నలకు, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనాన్ని కలిగించనున్నాయి.

ప్రజలకు సూచనలు: అయితే ఈ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేసింది. వర్షాల సమయంలో ఎవరూ చెట్ల కింద ఉండవద్దని స్పష్టం చేసింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడే ప్రమాదం ఉందని.. రైతులు పొలాలకు వెళ్లే సమయంలో ముందు వెనుకా చూసుకుంటూ వెళ్లాలని స్పష్టం చేసింది.

ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు విరిగిపడినట్టు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. అలాగే వర్షాల సమయంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది. వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది