
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లక్కర్లేదు అనేది పాత మాట. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరికే యాపిల్స్‌ను నేరుగా తింటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లక తప్పదు అంటున్నారు నిపుణులు. యాపిల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, ఆకర్షణీయంగా మెరవడానికి వాటిపై కృత్రిమ మైనపు పూత పూస్తున్నారు. అందుకే యాపిల్స్‌ను తినే ముందు వ్యాక్స్ తొలగించే ఈ సహజ పద్ధతులు పాటించండి.

వెనిగర్ మ్యాజిక్: ఒక గిన్నె నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలపండి. అందులో యాపిల్స్‌ను 5 నిమిషాల పాటు నానబెట్టండి. వెనిగర్‌లోని ఆమ్లాలు మైనపు పొరను సులభంగా విచ్ఛిన్నం చేస్తాయి.

గోరువెచ్చని నీటితో క్లీనింగ్: ఒక గిన్నెలో కొంచెం వేడి నీటిని తీసుకుని అందులో యాపిల్‌ను 2-3 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత బయటకు తీసి శుభ్రమైన కాటన్ గుడ్డతో గట్టిగా తుడవండి. వేడికి వ్యాక్స్ కరిగి గుడ్డకు అంటుకుంటుంది.

ఉప్పు నీటి చికిత్స: గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి, యాపిల్ పండ్లను పది నిమిషాల పాటు అందులో ఉంచండి. ఉప్పు మైనం కరిగిపోయేలా చేయడమే కాకుండా, పండ్లపై ఉన్న క్రిములను కూడా చంపుతుంది.

బేకింగ్ సోడా - నిమ్మరసం: నీటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంలో యాపిల్స్‌ను 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత మంచినీటితో కడిగితే వ్యాక్స్‌తో పాటు హానికరమైన రసాయనాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.