
చేపల కూర రుచి ఎంత బాగుంటుందో, వాటిని శుభ్రం చేసేటప్పుడు వచ్చే వాసన అంత ఇబ్బందికరంగా ఉంటుంది. చాలామంది ఎన్నిసార్లు కడిగినా ఆ వాసన పోవడం లేదని బాధపడుతుంటారు. అయితే వంటింట్లో లభించే ఉప్పు, నిమ్మకాయ, పసుపు వంటి వస్తువులతో చేపల నీచు వాసనను చిటికెలో మాయం చేయవచ్చు.

నిమ్మకాయ - ఉప్పు మ్యాజిక్: ఇది అందరికీ అందుబాటులో ఉండే సులభమైన పద్ధతి. చేపల వాసనను పోగొట్టడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. మొదట చేపలను చల్లటి నీటితో కడగాలి. ఆపై చేప ముక్కలపై ఉప్పు, నిమ్మరసం చల్లి బాగా రుద్దాలి. 10 -15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడిగితే వాసన మటుమాయం.

పసుపు - వెనిగర్ క్లీనింగ్: కొన్ని రకాల చేపలు చాలా బలమైన వాసన వస్తాయి. అటువంటి వాటికి ఈ పద్ధతి బెస్ట్. ఒక గిన్నె నీటిలో టీస్పూన్ పసుపు, రెండు చెంచాల వెనిగర్ కలపండి. చేప ముక్కలను ఈ నీటిలో 5-7 నిమిషాలు నానబెడితే, వాసన పోవడమే కాకుండా అందులో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. ఇది చేపలను డీప్ క్లీన్ చేస్తుంది.

బియ్యం లేదా గోధుమ పిండితో జిడ్డుకు చెక్: చేపలు కొన్నిసార్లు జిడ్డుగా అనిపిస్తాయి. ఆ జిడ్డు వల్లే వాసన ఎక్కువగా వస్తుంది. చేపలపై పొడి బియ్యం పిండి లేదా గోధుమ పిండిని చల్లి సున్నితంగా రుద్దాలి.5 నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే జిడ్డు మొత్తం పోయి, ముక్కలు ఫ్రెష్‌గా తయారవుతాయి.

జాగ్రత్తలు: చేపలను ఎప్పుడూ చల్లటి నీటితోనే కడగాలి. వేడి నీటిని వాడితే ఆ వేడికి వాసన మరింత పెరుగుతుంది. శుభ్రం చేసిన వెంటనే ముక్కలను ఆరబెట్టకుండా, వెంటనే మసాలాలు పట్టిస్తే వాసన రాదు. చేపలు కడిగిన తర్వాత మీ చేతులు నీచు వాసన రాకుండా ఉండాలంటే, నిమ్మచెక్కతో చేతులను రుద్దుకుని కడుక్కోండి.