
మనం ఎంత తిన్నా చివరకు పెరుగుతో ఒక్క ముద్దైనా తినకపోతే ఆ భోజనం సంతృప్తిగా ఉండదు. అదే పెరుగులో ఉన్న మ్యాజిక్.. ఇది కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. అలాగే కడుపు సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు ఇందులో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది వేసవిలో మీ శరీరం డీహైడ్రేట్ కాకుండా కూడా ఉంచుతుంది.

అయితే ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతున్న నేపథ్యంలో బయటి పెరుగు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. అందుకే చాలా మంది ఇంట్లోనే పెరుగును తయారు చేసుకుంటున్నారు. అయితే ఇంట్లో చేసుకున్న పెరుగు మనకు దుకాణాల్లో దొరికినంత గట్టిగా, క్రీమీగా రాదు. అలాగే పెరుగు మెత్తగా మారి దాని నుంచి నీరు రావడం కూడా మొదలవుతుంది. ఇందుకు కారణం మనం సరైన పాలను ఎంచుకోకపోవడం, పెరుగు తయారీలో చిన్న తప్పులు చేయడమేనని ప్రముఖ షెఫ్‌లు చెబుతున్నారు.

Homemade Thick Yogurt Recipe (3)

పెరుగు తయారీలో ముఖ్యమైన ఘట్టం పాలను మరిగించడం. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. పాలను సగం సగం కాకుండా పూర్తిగా మరిగించాలి. తర్వాత వాటిని పూర్తిగా చల్లారనివ్వకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులో తోడు కోసం పెరుగును వేయాలి. అయితే పాలు మీకు పల్చగా అనిపిస్తే అందులో మీరు మిల్క్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇది పాలు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కలపండి. ఆ తర్వాత తాజా పెరుగును వేసి తోడు పెట్టండి. మరీ వేడిగా ఉన్నప్పుడే పాలలో పెరుగు వేస్తే అది ఎక్కువగా పులిసే ఛాన్స్ ఉంది. కాబట్టి పాలను గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లారనివ్వండి.

తర్వాత ఆ పాత్రపై మూత పెట్టి గుడ్డతో చుట్టి వెచ్చటి ప్రదేశంలో 6 నుంచి 8 గంటల పాటు ఉంచండి. మీకు పెరుగు గట్టిగా రావాలంటే మట్టి పాత్రను ప్రయత్నించండి. ఎందుకంటే ఇది తేమను పీల్చుకుంటుంది కాబట్టి పెరుగు గట్టిగా వస్తుంది. పెరుగు తోడుకున్న తర్వాత దాన్ని నేరుగా ఉపయోగించకుండా గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల పెరుగు నుంచి నీరు రాకుండా గట్టిగా మారుతుంది. ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే మీరు ఇంట్లోనే గడ్డ పెరుగును తయారు చేసుకోవచ్చు.