
మీరు ఇంట్లోనే పనీర్ 65 ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మొదటగా తాజా పనీర్‌ను తీసుకొచ్చి ముక్కలుగా కచ్ చేయండి. వీటిని నేరుగా పిండిలో ముంచకుండా.. మొదట పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి 15 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మసాలా పన్నీర్ లోపలి వరకు పట్టి, తింటున్నప్పుడు ప్రతి ముక్క చాలా రుచిగా ఉంటుంది.

అయితే కలిపేటప్పుడు కేవలం మైదా లేదా కార్న్ ఫ్లోర్ మాత్రమే వాడకుండా, కాస్త బియ్యప్పిండి, ఉప్మా రవ్వ కూడా వేసి బాగా కలపండి. అలాగే పిండిలో కొద్దిగా గట్టి పెరుగు, ఇంగువ కూడా వేయండి. ఇవి వేయడం వల్ల వేయించిన తర్వాత నూనె ఎక్కువగా పీల్చకుండా, చాలా సేపు కరకరలాడుతూ ఉంటాయి.

మీరు మార్కెట్‌లో దొరికే మసాలా పొడులు కాకుండా జిలకర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించి ఇంట్లోనే పొడి చేయండి.. దాన్నే పనీర్ 65కోసం వాడండి. ఈ పొడి హోటల్ రుచిని మించిన మంచి సువాసనను, కారకారమైన రుచిని ఇస్తుంది.

ఇప్పుడు పన్నీర్ ముక్కలను మీడియం వేడి ఉన్న నూనెలో కాస్త వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే కాసేపు వాటిని చల్లారనివ్వండి. అది కాస్త చల్లారాక, మళ్లీ బాగా కాగిన నూనెలో కొన్ని సెకన్లు వేయించండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ రబ్బరులా మారకుండా, బయట కరకరలాడుతూ లోపల దూదిలా మెత్తగా ఉంటుంది.

చివరగా వేయించిన పన్నీర్‌ను నేరుగా ప్లేట్‌లోకి వేసుకోకండి, కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, మిరియాల పొడి వేసి కాసేపు అటు ఇటూ వేయించండి. ఇలా తాలింపు వేయడం పన్నీర్ 65కి అదనపు రుచిని, అద్భుతమైన సువాసనను ఇస్తుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే.. పనీర్ 65 రెడీ అయినట్టే.