
గోధుమ పిండి: 2 కప్పులు , మైదాపిండి: 2 కప్పులు, బొంబాయి రవ్వ , ఉప్పు, నెయ్యి/నూనె: 1/4 కప్పు , నీళ్లు: పిండి కలపడానికి తగినంత, బెల్లం తురుము: 2 కప్పులు,నీళ్లు పాకం కోసం, నెయ్యి, యాలకుల పొడి వన్ టీ స్పూన్. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల మైదాపిండి వేసుకోవాలి. అర కప్పు బొంబాయి రవ్వను మిక్సీ జార్‌లో వేసి మధ్య మధ్యలో ఆపుతూ వీలైనంత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ రవ్వ 85 గ్రాములు ఉంటుంది. ఈ రవ్వ పొడిని గోధుమపిండి, మైదాపిండి మిశ్రమంలో వేసి, రెండు చిటికెల సాల్ట్ కూడా కలిపి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు 1/4 కప్పు వేడి నెయ్యి లేదా నూనె పోసి పిండికి బాగా పట్టించాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్‌తో కలిపి, ఆపై చేత్తో పిండిని బాగా రబ్ చేస్తూ కలపాలి. ఇది గవ్వలు గుల్లగా, క్రిస్పీగా రావడానికి చాలా ముఖ్యం. నెయ్యి సరిపోయిందో లేదో తెలుసుకోవడానికి, కొద్దిగా పిండిని చేతితో నొక్కితే ముద్దలాగా రావాలి. ఒకవేళ రాకపోతే, మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకుండా చూసుకోవాలి, లేదంటే పిండి జారుగా మారి గవ్వల ఆకారం సరిగా రాదు. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా, కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. కలిపిన పిండిపై ఒక టీ స్పూన్ నూనె రాసి, ఆరిపోకుండా మూత పెట్టి కనీసం అరగంట పాటు నానబెట్టాలి .

తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్‌లా తయారు చేసుకవాలి. ఆ తర్వాత వాటిని గవ్వల చెక్క తీసుకొని దానికి కొంచెం నూనె రాసి, ఒక్కో పిండి ముంద్దను చెక్కపై అంటించి, గట్టిగా రోల్ చేయాలి. తర్వాత ఈ గవ్వలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని ఒక పాన్ తీసుకొని అందులో నూనె పోసి, ఆయిల్ వేడి అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. గవ్వలు మచిగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.తర్వాత వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం అడుగు మందం ఉన్న ఒక గిన్నెను గ్యాస్ పై పెట్టాలి. అందులో రెండు కప్పుల బెల్లం తురుము వేసుకోవాలి. దానికి 1/4 కప్పు నీళ్లు పోసి, బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. మంటను మీడియంలో పెట్టి, తీగ పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

ఆ తర్వాత అందులో గవ్వలు వేయాలి. గవ్వలు ఒకదానికొకటి అంటుకోకుండా, పాకం తీగల్లా రాకుండా విడివిడిగా అయ్యేంతవరకు మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇస్తూ కలుపుకోవాలి. పాకం అంతా బాగా పట్టిన తర్వాత, గవ్వలను సమానంగా స్ప్రెడ్ చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. అంతే గవ్వలు రెడీ. ఇక ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే చాలా రోజుల వరకు తాజాగా, క్రిస్పీగా ఉంటాయి.