
కావలసిన వస్తువులు: ఆరోగ్యకరమైన పాత చామంతి మొక్క, రూటింగ్ మీడియం కోసం నది ఇసుక, డ్రైనేజ్ హోల్స్ ఉన్న చిన్న కుండీ లేదా నర్సరీ ట్రే, పదునైన, శానిటైజ్ చేసిన ప్రూనింగ్ కటర్ లేదా కత్తెర, ఆర్గానిక్ రూటింగ్ ఏజెంట్లు: కలబంద కాడ లేదా తేనె & దాల్చిన చెక్క పొడి మిశ్రమం, 1 భాగం తోట మట్టి, 1 భాగం వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు, 1 భాగం కోకోపీట్, 1 భాగం ఇసుక

పాత చామంతి మొక్క నుండి చీడపీడలు లేని దృఢమైన కొమ్మలను ఎంచుకోవాలి. పదునైన కటర్‌తో 3 నుండి 4 అంగుళాల పొడవు ఉండేలా, నోడ్ (కణుపు) కింద భాగాన్ని కట్ చేయాలి. ప్రతి కట్టింగ్‌లో కనీసం 2-3 కణుపులు ఉండేలా చూసుకోవాలి. కటింగ్ అడుగు భాగంలో ఇసుకలోకి వెళ్లే ప్రాంతంలోని ఆకులను చేతితో సున్నితంగా తుంచేయాలి. పైభాగంలో కేవలం 2 నుండి 3 ఆకులు మాత్రమే ఉంచి, పెద్ద ఆకులు ఉంటే వాటిని సగానికి కట్ చేయాలి; దీనివల్ల తేమ కోల్పోకుండా ఉండి మొక్క వేగంగా వేర్లు తొడుగుతుంది.

కటింగ్ అడుగు భాగాన్ని కొద్దిగా నీటితో తడిపి.. రూటింగ్ హార్మోన్ పౌడర్‌లో తేలికగా ముంచాలి. పౌడర్ లేకపోతే తాజా కలబంద ముక్కలోని జెల్లో కటింగ్ భాగాన్ని ముంచాలి లేదా అర చెంచా తేనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపిన మిశ్రమాన్ని అడుగు భాగానికి పల్చగా పూయాలి.కుండీలో తడిపిన ఇసుకను నింపి.. చిన్న పుల్లతో రంధ్రాలు చేసి, కటింగ్ యొక్క 1 లేదా 2 నోడ్స్ ఇసుక లోపలికి వెళ్లేలా జాగ్రత్తగా గుచ్చాలి. చుట్టూ ఉన్న ఇసుకను వేళ్లతో తేలికగా నొక్కాలి. కొమ్మల మధ్య తగినంత గాలి ప్రసరణ ఉండేలా గ్యాప్ ఉంచాలి.

నాటిన కుండీని ఎండ తగలని బ్రైట్ ఇండైరెక్ట్ వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఇసుక పైపొర పొడిగా అనిపించినప్పుడు మాత్రమే స్ప్రేయర్ ద్వారా తేలికగా నీటిని స్ప్రే చేయాలి; అధికంగా నీరు పోస్తే కొమ్మలు కుళ్లిపోతాయి. వేర్లు వచ్చాయా లేదా అని మాటిమాటికీ కొమ్మలను పీకి చూడకూడదు.

సుమారు 3 నుండి 4 వారాల్లో కొమ్మలపై కొత్త చిగుళ్లు వచ్చి వేర్లు బలపడతాయి. అప్పుడు వేర్లు తెగిపోకుండా ఇసుక నుండి కొమ్మలను జాగ్రత్తగా వేరుచేసి.. గార్డెన్ సాయిల్, కంపోస్ట్, ఇసుక, కోకోపీట్ కలిపిన వెల్-డ్రైనింగ్ పాటింగ్ మిక్స్‌లో నాటుకోవాలి. మొదట 2 రోజులు నీడలో ఉంచి, ఆ తర్వాత క్రమంగా ఉదయం పూట ఎండ తగిలే ప్రదేశానికి మార్చుకోవాలి. అంతే, ఇంట్లోనే ఎంతో సులభంగా చామంతి మొక్కలను వృద్ధి చేసుకోవచ్చు! కొద్దిరోజుల్లోనే మొక్క ఏపుగా పెరిగి గుబురుగా మారి శీతాకాలంలో లెక్కలేనన్ని పూలతో మీ తోటను శోభాయమానంగా మారుస్తుంది!