చలికాలంలో చర్మ, జుట్టు సమస్యలు పెరుగుతాయి. ఈ సమయంలో చర్మం గరుకుగా, పొడిగా మారుతుంది. చుండ్రు సమస్య కూడా పెరుగుతుంది. అయితే చాలా మంది దాదాపు ఏడాది పొడవునా చుండ్రుతో బాధపడుతుంటారు. కానీ చలికాలంలో ఈ సమస్య రెట్టింపు అవుతుంది. ఈ చుండ్రు సమస్య నుంచి సులభంగా బయటపడాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తల చర్మం పొడిగా మారినప్పుడు చుండ్రు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సమస్య నుండి విముక్తి పొందాలంటే ముందుగా స్కాల్ప్ తేమగా ఉంచుకోవడం అవసరం. తరచుగా షాంపూతో తలని శుభ్రంగా ఉంచుకోవడం అవసరం. అప్పుడు ఈ సమస్యను కొంత వరకు నివారించడం సాధ్యమవుతుంది. చుండ్రు ప్రధానంగా మలాసెజియా అనే ఫంగస్ వల్ల వస్తుంది.
ఇంటి నివారణలతో కూడా చుండ్రును వదిలించుకోవచ్చు. నిమ్మ ఆకులు చుండ్రును వదిలించుకోవడానికి మీకు సహాయపడతాయి. వారానికి ఒకటి రెండు రోజులు నిమ్మరసాన్ని తలకు పట్టించాలి. వెంట్రుకలను విభజించి నిమ్మరసాన్ని తలకు, మూలాలకు పట్టిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
అంతే కాకుండా వేప ఆకులు కూడా చుండ్రును నివారిస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్ పదార్థాలు ఉంటాయి. ఇది చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం వేప ఆకుల రసాన్ని జుట్టుకు పట్టించాలి.
ఉల్లిపాయ రసం ఉపయోగించి కూడా చుండ్రు నివారణకు ప్రయత్నించవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయను దంచి ఆ రసాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ప్రయత్నించవచ్చు. కానీ దీనిని నేరుగా తలకు పట్టించకూడదు. ఇది జుట్టుకు హాని కలిగించవచ్చు. ఈ వెనిగర్‌ని నీళ్లలో కలిపి వాడాలి.