
సరైన కొలతలతో పిండిని ఎలా కలుపుకోవాలి, గుల్లగా రావడానికి ఎలాంటి ట్రిక్స్ పాటించాలో తెలిస్తే హోటల్ కంటే అద్భుతమైన రుచితో ఇంట్లోనే మైసూర్ బోండాలను తయారు చేసుకోవచ్చు. ఆ సులువైన తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు తాజా పెరుగు, ఒక కప్పు మైదా పిండి, అర టీస్పూన్ వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు, పిండిలో వేయడానికి-ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ తరిగిన కొబ్బరి ముక్కలు మరియు డీప్ ఫ్రైకి సరిపడా నూనె.

మైసూర్ బోండా తయారీ విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు పుల్లటి పెరుగును తీసుకోవాలి. పెరుగును విస్కర్ లేదా గరిటతో ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా బాగా బీట్ చేయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ వంట సోడా మరియు ఒక టేబుల్ స్పూన్ వేడి నూనె వేసి రెండు నిమిషాలు బాగా కలపాలి.

ఇలా కలపడం వల్ల పెరుగులో ఎయిర్ బబుల్స్ ఏర్పడి బోండాలు గుల్లగా రావడానికి సహాయపడతాయి. ఇప్పుడు పెరుగు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మైదా పిండిని వేయాలి. కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు చల్లుకుంటూ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా కాకుండా, గట్టిగా కాకుండా జాలువారేలా ఉండాలి.

పిండిని చేత్తో కింద నుంచి పైకి లాగుతూ కనీసం ఐదు నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. ఈ దశలోనే పిండిలోకి గాలి చేరి బోండాలు స్పాంజిలా తయారవుతాయి. అనంతరం పిండిలో జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి నెమ్మదిగా కలపాలి. గిన్నెపై మూతపెట్టి కనీసం గంట నుండి రెండు గంటల పాటు నాననివ్వాలి.

స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత చేతిని నీళ్లలో తడుపుకుని, పిండిని బొటనవేలు మరియు చూపుడు వేలు మధ్యలో నుంచి గుండ్రంగా నూనెలోకి డ్రాప్ చేయాలి. బోండాలు నూనెలో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటతో అటూ ఇటూ తిప్పుతూ మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించి టిష్యూ పేపర్‌పైకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ మైసూర్ బోండాలు సిద్ధం! వేడివేడి బోండాలను పల్లి చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే అద్భుతమైన రుచినిస్తాయి.