
మునగాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది శరీరానికి మేలు చేస్తుంది. అయితే దీనిని తయారు చేసుకోవడానికి, రెండు కప్పుల మునగాకు, అర కప్పు కరివేపాకు, ఎండు మిర్చీ 9, రెండు టీ స్పూన్ల శనగ పప్పు,పల్లీలు, మినపప్పు,నువ్వులు, కొబ్బరి తురుము తీసుకోవాలి. అలాగే నిమ్మకాయంత చింత పండు, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడ ఉప్పు.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా మునగాకు, కరివేపాకు తీసుకొని వాటిని నీటిలో శుభ్రం చేసి, ఫ్యాన్ కింద గాలికి ఆరబెట్టాలి. నీరు పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో నూనె వేసి, ఈ రెండింటిని బాగా కర కరమనేలా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే కడాయిలో , నూనె వేసి, అందులో వెల్లుల్లి, చింత పండు,శనగపప్పు, పల్లీలు, నువ్వులు, ఎండు మిర్చీ, కొబ్బరి తురుము వేసి అన్నీ బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు వేసి రెండు నిమిషాలు కలుపుకోవాలి.

తర్వాత కాస్త వేడి చల్లారిన తర్వాత వీటిని మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే నోటికి రుచిగా ఉంటుంది.

తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు కూడా మిక్సీజార్‌లో వేసుకొని చాలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి ఎండు మిర్చీ పౌడర్, మునగాకు,కరివేపాకు పొడి ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. అంతే మునగాకు పొడి రెడీ, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది.