
అందమైన, ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు? కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో జుట్టు సంరక్షణ అనేది ఒక సవాలుగా మారింది. జుట్టు రాలడం, చిట్లిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కేవలం నూనె రాస్తే సరిపోదు, అది ఎప్పుడు రాయాలనేది కూడా చాలా ముఖ్యం. ఈ విషయాలు తెలియకపోతే జుట్టు సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.

తలస్నానానికి ముందు: తలస్నానానికి ముందే నూనె రాసుకోవడం అత్యంత ఉత్తమం. స్నానానికి ఒక గంట ముందు నూనె రాసి మెల్లగా మసాజ్ చేయడం వల్ల తల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కుదుళ్లను బలోపేతం చేస్తుంది. నూనె జుట్టుపై ఒక రక్షణ పొరను ఏర్పరుస్తుంది. దీనివల్ల షాంపూలోని రసాయనాలు జుట్టును పొడిగా మార్చకుండా కాపాడతాయి. వీలైతే రాత్రిపూట నూనె రాసుకుని, ఉదయం తలస్నానం చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది.

తడి జుట్టుకు నూనె: చాలా మంది స్నానం చేసిన వెంటనే తడి జుట్టుకు నూనె రాస్తుంటారు. కానీ ఇది పెద్ద పొరపాటు. తడి జుట్టుకు నూనె రాయడం వల్ల బయట ఉండే దుమ్ము, ధూళి త్వరగా అంటుకుంటాయి. తలలో తేమ, నూనె కలిసి ఉండటం వల్ల చుండ్రు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ స్నానం తర్వాత జుట్టు చిక్కులు పడకుండా ఉండాలంటే, నూనెకు బదులుగా తేలికపాటి హెయిర్ సీరమ్ లేదా కలబంద జెల్ వాడటం ఉత్తమం.

ఏ నూనె వాడాలి?: మీ జుట్టు తత్వాన్ని బట్టి సరైన నూనెను ఎంచుకోవడం ముఖ్యం. కొబ్బరి నూనె సహజ సిద్ధమైన పోషణకు ఉపయోగపడుతుంది. బాదం నూనె జుట్టు మృదువుగా మారడానికి, ఆమ్లా లేదా బ్రాహ్మి జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి సహాయపడతాయి.

నూనెను ఎప్పుడూ నేరుగా కాకుండా కొద్దిగా గోరువెచ్చగా చేసి వేలి చివర్లతో నెత్తిపై మర్దనా చేయాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోయే సమస్య తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యం కేవలం పైన రాసే నూనె మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మీరు తీసుకునే సమతుల్య ఆహారం, తగినంత నీరు, తక్కువ ఒత్తిడి కూడా జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. సరైన అలవాట్లు పాటిస్తే, మీ జుట్టును దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.