
శరీరంలోని కీలక ఉష్ణోగ్రతలు, జీర్ణక్రియ: మన నోటిలో సుమారు 35°C (98.4°F), పొట్టలో దాదాపు 36°C (100°F) ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ అనువైన ఉష్ణోగ్రతల వద్దే లాలాజలంలో, పొట్టలో, ప్రేగులలో ఉండే జీర్ణ ఎంజైములు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో, పోషకాలను శోషించుకోవడంలో, అలాగే క్రిములతో పోరాడటంలో ఈ ఎంజైములు కీలక పాత్ర పోషిస్తాయి. పొట్టలో సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే పాంక్రియాటిక్ జ్యూస్‌లు, ఇతర జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి.

చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది: మనం 0 డిగ్రీస్ గల చల్లటి ఐస్‌క్రీమ్‌లు, కూల్ డ్రింక్‌లు, ఫ్రిజ్ నీరు తీసున్నప్పుడు..ఇవి పొట్టలోకి చేరగానే దాని ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. 100°F వద్ద ఉండాల్సిన పొట్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 20-30°Fకి పడిపోతుంది. దీని వల్ల జీర్ణ ఎంజైముల ఉత్పత్తి, పనితీరులో మార్పులు వస్తాయి. చల్లటి వాతావరణంలో ఎంజైములు సరిగ్గా పనిచేయకపోవడంతో జీర్ణక్రియ మందగిస్తుంది లేదా పూర్తిగా నిలిచిపోతుంది. పొట్ట దాని సాధారణ ఉష్ణోగ్రతను తిరిగి పొందడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. ఈ సమయంలో ఆహారం జీర్ణం కాకుండా నిలిచిపోయి, పులిసిపోయి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణవ్యవస్థ కదలికలపై ప్రభావం: పొట్ట, ప్రేగులు ఆహారాన్ని అరిగించడానికి, ముందుకు కదపడానికి నిరంతరం సంకోచించి, వ్యాకోచిస్తుంటాయి. అయితే, చల్లటి పదార్థాలు ఈ కదలికలను తగ్గిస్తాయి. చలికి శరీరం ఎలా ముడుచుకుంటుందో, అలాగే పొట్ట ప్రేగులు కూడా సంకోచించి, వాటి సహజ కదలికలను కోల్పోతాయి. దీనిని గ్యాస్ట్రిక్ పెరిసిస్ అంటారు. ఫలితంగా ఆహారం కదలిక మందగించి, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గొంతు, రోగనిరోధక శక్తిపై ప్రభావం: గొంతులో ఉండే టాన్సిల్స్ ఆహారంలోని క్రిములతో పోరాడే రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. మనం తీసుకునే కూల్‌డ్రింక్స్ చల్లదనం వల్ల టాన్సిల్స్ సంకోచించి, వాటి క్రిమిసంహారక శక్తిని కోల్పోతాయి. దీనివల్ల క్రిములు సులభంగా లోపలికి ప్రవేశించి, గొంతు నొప్పులు, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లు, ఎడినాయిడ్స్ వాపు, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తాయి. అలాగే, ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా పనితీరు కూడా చల్లదనానికి ఆటంకం కలిగి, రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడానికి కారణమవుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సమ్మర్‌లో ఫ్రిజ్‌లో ఉండే కూల్ వాటర్ తీసుకోవడం కన్నా మట్టి కుండలోని నీరు వంటి సహజమైన, సాధారణ చల్లదనం కలిగిన ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ నీరు త్రాగాలనుకుంటే, దానిని సాధారణ నీటితో కలిపి త్రాగడం ద్వారా అతి చల్లదనాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. బటయదొరికే ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ విషయాలను వివరించి, వారిని ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు ప్రోత్సహించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.