Physical Weakness: ఉరుకులు పరుగుల జీవితం.. పని ఒత్తిడి.. కుటుంబ బాధ్యతలు.. పైగా అనారోగ్య సమస్యలు.. ఇలా మనిషి జీవితం మొత్తం ఈ రోజుల్లో ఆందోళనకరంగా మారింది. చాలా మంది ఏదో ఒక పనిలో పడి బిజీగా మారడం వల్ల సరైన పోషకాహారం తీసుకోలేకపోతున్నారు. దీని వల్ల ప్రజలు తరచూ అలసిపోతారు. ఒక చిన్న పని చేసినా కూడా చాలా మంది నీరసంగా మారిపోతారు. దీనికి ప్రధాన కారణం శరీర బలహీనతని వైద్యులు పేర్కొంటున్నారు.
శరీర బలహీనతను నయం చేయడానికి చాలాసార్లు ప్రజలు మందులను ఆశ్రయించవలసి ఉంటుంది. కానీ అలాంటివి మానవ శరీరాన్ని మరింత ప్రమాదంలో పడేలా చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు శారీరక బలహీనతతో కూడా ఇబ్బంది పడుతుంటే, మీరు మీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకోవాలి. శారీరక బలహీనతను తొలగించడానికి మీరు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అంజీర్: అంజీర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండిన అత్తి పండ్లు ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వుకు మంచి మూలం. ఇది మీ శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తుంది. మరోవైపు, మీరు రోజూ ఉదయం అల్పాహారంలో అత్తి పండ్లను తీసుకుంటే, అది మీ ప్రేగులను బలంగా మారుస్తుంది. తరచూ మీరు బలహీనతకు గురైనట్లయితే ప్రతిరోజూ ఎండిన అత్తి పండ్లను తీసుకోవడం ప్రారంభించాలి. దీంతో బలహీనత దూరంగా శరీరం బలంగా మారుతుంది.
ఖర్జూరాలు: ఖర్జూరాలు మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు, మీ శరీరం చాలా సన్నగా ఉంటే, మీరు ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం ప్రారంభించాలి. దీనితో పాటు శరీరంలో బలహీనత ఉన్నా.. ఖర్జూరాన్ని తినాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది మీ శరీర బలహీనతను దూరం చేస్తుంది.
ఎండుద్రాక్ష/కిస్‌మిస్: ద్రాక్షను ఎండబెట్టడం ద్వారా కిస్ మిస్ లను తయారు చేస్తారు. ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉండే ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాపర్ వంటి పోషకాలు బలహీనత, అలసట, తలతిరగడం వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకే ఎప్పుడూ బలహీనత ఉంటే ఎండుద్రాక్షను పాలలో వేసి మరిగించి తినండి. దీంతో బలహీనత దూరమవుతుంది.