మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ప్రారంభించిన ఈ ఆటగాడు.. అక్కడ విజయం సాధించలేదు. అయితే ఆయన ఓపెనింగ్‌లో చేరినప్పుడు మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఓపెనర్‌లలో ఒకడిగా మారాడు. ఇక్కడ మనం వీరేంద్ర సెహ్వాగ్ లేదా రోహిత్ శర్మ గురించి మాట్లాడటం లేదు. వాస్తవానికి ఈ బ్యాట్స్‌మెన్ తన జట్టుకు ఉపయోగపడే బౌలింగ్ కూడా చేసేవాడు. అలా జట్టు అడిగినప్పుడల్లా కీపింగ్ కూడా చేసేవాడు. అలాగే కెప్టెన్సీని కూడా చేపట్టాడు. ఈ క్రికెటర్ శ్రీలంకకు చెందిన తిలకరత్నే దిల్షాన్. ఈ రోజు అతని పుట్టినరోజు. దిల్షాన్ కెరీర్‌లో కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. తిలకరత్నే దిల్షాన్ మూడు టెస్టులు, వన్డేలు, టీ 20 ల్లో శ్రీలంక తరపున బరిలోకి దిగాడు.
1999 లో జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌తో తిలకరత్నే దిల్షాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మొదటి సిరీస్‌లోనే అజేయంగా 163 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ, మిడిల్ ఆర్డర్‌లో ఆడుతున్నప్పుడు మాత్రం ఫెయిల్యూర్స్ చవిచూశాడు. అటువంటి పరిస్థితిలో జట్టులోకి రావడం, మరలా చోటు కోల్పోవడం అలవాటుగా మారింది. అయితే 2003 తర్వాత దిల్షాన్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగాడు. 2009 లో అతను ఓపెనర్‌గా మారాడు. 2009కి ముందు వన్డేల్లో దిల్షాన్ వార్షిక సగటు స్కోర్లు 35 కి మించలేదు. కానీ, 2009 తరువాత వన్డే సగటు 50గా మారింది. అన్ని ఫార్మాట్లలో 11 సెంచరీలు చేశాడు. అదే సంవత్సరంలో 2009లో టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎన్నికయ్యాడు.
ఓపెనర్‌గా మారిన తర్వాత, దిల్షాన్ తన వన్డే కెరీర్‌లో నాలుగు సార్లు ఒక క్యాలెండర్ సంవత్సరంలో 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అలాగే 2009 నుంచి 2015ల మధ్య, ఒక సంవత్సరంలో అతని పరుగుల సంఖ్య 800 కంటే తక్కువగా లేదు. వన్డేల్లో 10,000 పరుగుల మార్కును చేరుకున్న నాలుగో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌గా మారాడు. దిల్షాన్ వన్డేల్లో 330 మ్యాచ్‌ల్లో 10,290 పరుగులు, 106 వికెట్లు తీసుకున్నాడు. అతను ఈ ఫార్మాట్‌లో 22 సెంచరీలు చేశాడు. అదే సమయంలో 87 టెస్టుల్లో 16 సెంచరీలతో 5492 పరుగులు అతని ఖాతాలో చేరాయి.
2009 లో తిలకరత్నే దిల్షాన్ క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త షాట్ కనుగొన్నాడు. ఈ షాట్‌ను దిల్‌స్కూప్ అని పిలుస్తుంటారు. ఇందులో వికెట్ కీపర్ తలపై నుంచి బంతిని బౌండరీకి తరలిస్తుంటారు. దిల్షాన్ లాగా ఎవరూ ఈ షాట్ ఆడలేరు. ఈ షాట్ ద్వారా అతను టీ 20 క్రికెట్‌లో చాలా విజయాలు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో దిల్షాన్ అంతర్జాతీయ స్థాయిలో 80 మ్యాచ్‌లలో సెంచరీ, 13 అర్ధసెంచరీలతో 1889 పరుగులు చేశాడు.
2011 లో కుమార్ సంగక్కర కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత దిల్షాన్ శ్రీలంక కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కానీ, ఒక సంవత్సరం తరువాత అతను ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్సీ సమయంలో జట్టు ఆటగాళ్ల నుంచి తనకు పూర్తి మద్దతు లభించలేదని ఆ తరువాత వెల్లడించాడు. ఇందులో, ఏంజెలో మాథ్యూస్ పేరు అగ్రస్థానంలో ఉంది. 2012 లో దిల్షాన్ తన టీ 20, వన్డే కెరీర్‌ను పొడిగించడానికి టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. అతను కెప్టెన్సీ, టెస్ట్ క్రికెట్‌ని వదిలివేయడం ద్వారా ఎంతో ప్రయోజనం పొందాడు. 2012 లో 1119 పరుగులు చేశాడు. 39 సంవత్సరాల వయస్సు వరకు ఆడుతూనే ఉన్నాడు. చివరకు 2019 లో రిటైర్ అయ్యాడు.