
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశ్వసి జైస్వాల్ అదరగొడుతున్నాడు. రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీతో సిరీస్‌లోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజ్‌కోట్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించడంలో సహాయపడ్డాడు.

జైస్వాల్ ప్రతిభకు తోటి ప్లేయర్స్, మాజీ క్రికెటర్లే కాదు.. ప్రత్యర్ధి ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టెస్టుల్లో ఫ్యూచర్ సూపర్ స్టార్ ఇన్ మేకింగ్ అంటూ కితాబు ఇస్తున్నారు. 22 ఏళ్ల యశస్వి జైస్వాల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటిదాకా 3 సెంచరీలు సాధించాడు.

అలాగే అత్యంత వేగంగా మూడు టెస్టు సెంచరీలు సాధించిన ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ ఫార్మాట్‌లో జైస్వాల్ ఓపెనర్‌గా దాదాపు ఖరారైనట్టే.

ఇక మనోడి దెబ్బకు టీమిండియాలో చోటును సుస్థిరం చేసుకోవాలని చూస్తున్న మరో 3గురు ప్లేయర్స్ బ్యాగులు సర్దుకోవాల్సిందిగా కనిపిస్తోంది. మరి వారెవరో చూసేద్దాం.

పృథ్వీ షా: 24 ఏళ్ల పృథ్వీ షా భారత్ తరఫున 5 టెస్టులు ఆడాడు, 2020లో చివరి టెస్టు ఆడాడు. గాయం కారణంగా చాలాకాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న అతడు ఇటీవలే తిరిగి పునరాగమనం చేశాడు. జైస్వాల్ ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే.. షా టెస్టుల్లో టీమిండియా తరపున ఆడటం ఇప్పట్లో కష్టమే.

మయాంక్ అగర్వాల్: 33 ఏళ్ల మయాంక్ ఒకప్పుడు భారత ఓపెనర్‌గా టెస్టుల్లో ఆడాడు. కానీ అతడు 2022 నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు. మయాంక్ భారత్ తరఫున 21 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతని పేరిట 4 సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రోహిత్-జైస్వాల్‌ల జోడీ ఖాయమవడంతో మయాంక్‌కు అంత సులువు కాదు.

అభిమన్యు ఈశ్వరన్: 28 ఏళ్ల అభిమన్యు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించాడు. అతడ్ని టీమ్ ఇండియా రెండు, మూడుసార్లు పిలిచింది. కానీ తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు టీమిండియాకు చాలామంది ఓపెనర్లు ఉన్నందున, ఈశ్వరన్ పునరాగమనం కూడా సాధ్యం కాదు.