
పాకిస్తాన్ యంగ్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ ఓ ఇంటివాడయ్యాడు. మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాతో కలిసి నిఖా చేసుకున్నాడు. కరాచీ నగరంలో జరిగిన వీరి వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు పాక్ క్రికెటర్లు హాజరయ్యారు.

పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, సర్ఫరాజ్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ హఫీజ్, మాజీ కోచ్ సక్లైన్ ముస్తాక్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. అలాగే షాహీన్ పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) జట్టు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం షాహీన్‌షా- అన్షాల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పాక్ క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా షాహీన్-అన్షాల ఎంగేజ్‌మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది. అయితే అన్షా చదువులకు తోడు షాహీన్ క్రికెట్ షెడ్యూల్‌లో బిజీగా ఉండడంతో పెళ్లి పీటలెక్కేందుకు ఈ సమయం పట్టింది.

కాగా 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు పాక్ తరఫున 25 టెస్ట్‌ల్లో 99 వికెట్లు పడగొట్టాడు. 32 వన్డేల్లో 62 వికెట్లు నేలకూల్చాడు. అలాగే 47 టీ20 మ్యాచుల్లో 58 వికెట్ల పడగొట్టి పాక్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.