
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌కు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు 4 మ్యాచ్ లు ఆడిన ముంబై టీం కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి, 3 మ్యాచ్ లు ఓడిపోయింది.

ఈక్రమంలో ముంబై జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. రోహిత్ శర్మకు తొడ కండరాల గాయం (హాంస్ట్రింగ్) కావడం జట్టును మరింత కష్టాల్లోకి నెట్టింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో 13 బంతుల్లో 19 పరుగులు చేసిన రోహిత్, క్రీజులో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. ముంబైలోని విపరీతమైన ఉక్కపోతకు తోడు గాయం తీవ్రత పెరగడంతో, ఫిజియోతో చర్చించిన అనంతరం ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ మాట్లాడుతూ, రోహిత్ గాయం ఎంత తీవ్రంగా ఉందో ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నాడు. ఇది అభిమానుల్లో కొంత ఆందోళన రేకెత్తించింది. అయితే, తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం రోహిత్ శర్మకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నాడు ఆయనకు స్కానింగ్ పరీక్షలు జరుగుతాయని, ఆ ఫలితాల ఆధారంగానే తదుపరి మ్యాచ్‌లలో ఆయన భాగస్వామ్యంపై స్పష్టత వస్తుందని సమాచారం.

పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరం కానున్నారా?: ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే, జట్టు యాజమాన్యం రోహిత్ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. ఒకవేళ గాయం స్వల్పమైనది అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆయనకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ సుదీర్ఘమైన టోర్నీ కావడంతో, కీలకమైన చివరి దశ మ్యాచ్‌ల కోసం రోహిత్‌ను సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచాలని ముంబై యోచిస్తోంది.

రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దూరం కావడం ముంబై బ్యాటింగ్ లైనప్‌కు పెద్ద లోటు. ఓపెనింగ్‌లో ఆయన ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు, ముంబై తిరిగి విజయాల బాట ఎలా పడుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు.