
ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ వ్యవహారంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. జట్టు యాజమాన్యం ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తోందని, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థానంలో యువ సంచలనం తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని వార్తలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. తెలుగు యువకుడు తిలక్ వర్మ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు తిలక్ వర్మ సారథ్యం వహించవచ్చనే ప్రచారం ఊపందుకుంది. దీనికి సమాంతరంగా, హార్దిక్ పాండ్యాను కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. నిజానికి, గతంలో ముంబై ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా బయటకు వెళ్తాడని లేదా ముంబై యాజమాన్యమే అతడిని వదులుకోవాలని చూస్తోందని చర్చ జరిగింది. హార్దిక్‌ను ట్రేడ్ చేయడం కోసం కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై ఇండియన్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, సరైన ప్రత్యామ్నాయ ఆటగాడు దొరకకపోవడంతో పాండ్యాను కొనసాగించాలని ముంబై ఇండియన్స్ అప్పట్లో నిర్ణయం తీసుకుందని అంటారు.

కెప్టెన్ ఎంపికకు సంబంధించిన విషయంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే కీలక పాత్ర అనే చర్చ ప్రస్తుతం ఉంది. కెప్టెన్సీ రేసులో జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపించినప్పటికీ, అతడి గాయాల సమస్యల దృష్ట్యా మేనేజ్‌మెంట్ తిలక్ వర్మను బెస్ట్ ఛాయిస్‌గా భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్‌ను వదులుకోవడానికి కూడా ముంబై ఇండియన్స్ సిద్ధంగా లేదనే ప్రచారం జరుగుతోంది.

అయితే, తిలక్ వర్మ కెప్టెన్సీలో హార్దిక్ పాండ్యా ఆడతాడా? అందుకు హార్దిక్ ఒప్పుకుంటాడా? అనేది ఆసక్తికరంగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే, గుజరాత్ టైటాన్స్ జట్టు అరంగేట్రం చేసినప్పుడు అతడే కెప్టెన్‌గా ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు మొదటి సీజన్‌లోనే టైటిల్ అందించాడు. ఆ తర్వాతి సీజన్‌లోనూ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్ళాడు. ఈ విజయవంతమైన కెప్టెన్సీ ప్రదర్శన తర్వాతే ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాను మళ్లీ తన జట్టులోకి తీసుకుంది.

కానీ, 2024 ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ పెద్దగా రాణించలేదు. జట్టు గ్రూప్ దశకే పరిమితమైంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా హార్దిక్ పాండ్యా అంచనాలను అందుకోలేకపోయాడు. 2023లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ వరకు వెళ్లినప్పటికీ, ఈసారి గ్రూప్ దశకే పరిమితం కావడంతో జట్టు భవిష్యత్తు నాయకత్వంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం, దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా తిలక్ వర్మకు పగ్గాలు అప్పగించే ఆలోచనలో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.