
IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తరఫున ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీలతో మెప్పించారు. టీమిండియా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన సమయంలో 5 నంబర్ బ్యాటర్‌గా రంగంలోకి దిగిన ఇషాన్ 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో మొత్తం 82 పరుగులు చేశాడు. ఇది ఇషాన్‌కి వరుసగా 4వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

ఈ క్రమంలోనే ఇషాన్.. టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. పాక్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా ఇషాన్ నిలిచాడు. అంతకముందు ధోని 76 పరుగులతో ఈ రికార్డ్‌ని కలిగి ఉండగా.. పాక్‌పై తాజాగా 82 పరుగులు చేసిన ఇషాన్ ‘ధోని’ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.

అలాగే వన్డేల్లో వరుసగా 4 అర్ధ సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్‌గా కూడా ఇషాన్ ధోనిని సమం చేశాడు. 2011లో ఇంగ్లాండ్‌పై ధోని (69, 78*, 50*, 87*) వరుసగా 4 హాఫ్ సెంచరీలు చేశాడు. అయితే ఇటీవలే విండీస్‌పై జరిగిన 3 వన్డేల్లోనూ హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ (52, 55, 77, 82), తాజాగా పాక్‌పై అదే ఫీట్ సాధించాడు.

ఇదే కాక, పాకిస్తాన్‌పై అర్థసెంచరీ చేసిన మూడో వికెట్ కీపర్‌గా కూడా ఇషాన్ ధోని సరసన నిలిచాడు. ఆసియా కప్‌లో పాక్‌పై ఇప్పటివరకు సురీందర్ ఖన్నా(1984లో 56), ఎంఎస్ ధోని(2008లో 76, 2010లో 56) హాఫ్ సెంచరీలు చేసిన భారత్ వికెట్ కీపర్లు. అయితే తాజాగా ఈ లిస్టులో ఇషాన్ కిషన్(2023లో 82) జాయిన్ అయ్యాడు.

కాగా, ఆసియా కప్‌లో భాగంగా జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో వరుణుడిదే పైచేయి అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 266 పరుగులకు ఆలౌట్ కాగా, వర్షం కారణంగా పాక్‌కి బ్యాటింగ్ అవకాశం రాలేదు. సమయం గడుస్తున్నా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ని రద్దు చేసి, ఇరుజట్లకు చెరో పాయింట్ ఇస్తున్నట్లుగా అంపైర్లు నిర్ణయించారు. అప్పటికే నేపాల్‌పై సాధించిన పాక్ మొత్తం 3 పాయింట్లతో సూపర్ 4 దశకు చేరింది.