ఐపీఎల్ 16వ సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. మ్యాచ్‌కి మ్యాచ్‌కి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. అయితే ఈ ఉత్కంఠ మధ్య కొన్ని టీమ్ కెప్టెన్లకు ఐపీఎల్ పాలకమండలి జరిమానా విధిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ఆయా జట్టు కెప్టెన్లపై ఒక మ్యాచ్ నిషేధం కూడా విధించే అవకాశం ఉంది.
నిజానికి ఐపీఎల్ మ్యాచ్‌లో స్లో ఓవర్లు వేస్తే టీమ్ కెప్టెన్‌కు ఆ ఒక్క ఆటకి రూ. 12 లక్షలు జరిమానా విధిస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐదుగురు ఐపీఎల్ టీమ్ కెప్టెన్లకు ఒక్కొక్కరికి 12 లక్షలు జరిమానా విధించారు.
వీరిలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నారు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ జట్టు అయినా నిర్ణీత గడువులోగా ఓవర్లు పూర్తి చేయకపోతే ముందుగా ఆ జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షలు చెల్లిస్తారు. రెండోసారి అదే తప్పు చేస్తే కెప్టెన్‌తో పాటు ఇతర ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కూడా 25 శాతం పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది.
మూడోసారి ఇలాంటి నేరానికి పాల్పడితే ఆ జట్టు కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా, ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అలాగే జట్టులోని ఇతర ఆటగాళ్లకు ఒక మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తారు.
ఈ తరుణంలో ఇప్పటికే జరిమానాను ఎదుర్కొన్న ఐదుగురు కెప్టెన్లలో ఏ ఒక్కరైనా ఇలాగే మరో రెండు సార్లు స్లో ఓవర్ వేస్తే.. వారిపై ఒక మ్యాచ్ నిషేధం పడే అవకాశం ఉంది.