
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ ఘట్టానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరుకు ఈ ప్రతిష్టాత్మక మైదానం వేదిక కానుంది. ఈ ఆదివారం జరగనున్న తుదిపోరులో భారత్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. అయితే, గతంలో ఇదే స్టేడియంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, టీమ్ ఇండియా ఈసారి తన వ్యూహాన్ని మార్చింది. ముఖ్యంగా పిచ్ తయారీలో ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెట్ అభిమానులు 2023 నవంబర్ 19వ తేదీని తేలిగ్గా మర్చిపోలేరు. ఆ వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోయి ఫైనల్‌కు చేరిన టీమ్ ఇండియా, అహ్మదాబాద్ మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ఆ రోజు మనకు నచ్చినట్లుగా తయారు చేయించుకున్న నల్లరేగడి మట్టి పిచ్ మనకే శాపంగా మారింది. బంతి నెమ్మదించి, మన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అంతెందుకు, ఇదే టీ20 ప్రపంచకప్‌లో కూడా సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అదే నల్లమట్టి పిచ్‌పై భారత్ ఓటమిపాలైంది. గత 32 ఐసీసీ మ్యాచుల్లో భారత్ ఓడిపోయిన ఆ రెండు మ్యాచ్‌లు కూడా అహ్మదాబాద్ పిచ్ మహిమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఈసారి పిచ్ విషయంలో ఎటువంటి రిస్క్ తీసుకోవడం లేదు. జాతీయ మీడియా కథనం ప్రకారం, ఫైనల్ మ్యాచ్ కోసం మిక్స్డ్ సాయిల్ పిచ్‌ను సిద్ధం చేశారట. అంటే అందులో ఎర్రమట్టి, నల్లమట్టి రెండింటినీ కలిపి వాడారు. సుమారు 70 శాతం ఎర్రమట్టి ఉండగా, మిగిలిన 30 శాతం మాత్రమే నల్లమట్టిని ఉపయోగించారట. దీనివల్ల పిచ్ నెమ్మదించకుండా బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది. మన బ్యాటర్లు స్ట్రోక్ ప్లే ఆడడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

సాధారణంగా నల్లమట్టి పిచ్చులు మ్యాచ్ గడుస్తున్న కొద్దీ నెమ్మదిస్తాయి, స్పిన్నర్లకు అనుకూలంగా మారుతాయి. కానీ ఎర్రమట్టి పిచ్చులు పేసర్లకు సహకరిస్తూనే, బ్యాటర్లకు మంచి స్కోర్లు చేసే అవకాశాలు ఇస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల ఆదివారం నాటి ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగనుంది. బంతి బ్యాట్‌పైకి వేగంగా వస్తుంది కాబట్టి, సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు భారీ షాట్లు ఆడే అవకాశం ఉంది.

న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఈ మిశ్రమ పిచ్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. కోట్లాది మంది భారతీయుల ఆశల వారధైన ఈ ఫైనల్ పోరులో మనవాళ్లు ట్రోఫీ ముద్దాడతారా లేదా అనేది రేపు తేలిపోనుంది. టీమ్ ఇండియా తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయం విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.