
IND vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశి రీఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయపడిన ఇషాన్ కిషన్ స్థానంలో జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశిని నేరుగా ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దించారు. అతను ఎనిమిది బంతుల్లో కేవలం నాలుగు పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. వైభవ్ ప్రదర్శనపై టీమిండియా మాజీ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

వైభవ్ సూర్యవంశి నెంబర్ త్రీలో బ్యాటింగ్‌కు వచ్చేసరికి నీటిలో నుంచి బయటపడ్డ చేపలా ఇబ్బంది పడ్డాడని అశ్విన్ పేర్కొన్నారు. తనకు అలవాటు లేని స్థానంలో ఆడుతున్నప్పుడు ప్రతి బంతిని బలంగా బాదడానికే ప్రయత్నించాడని, కానీ టైమింగ్ చేయలేకపోయాడని అశ్విన్ విశ్లేషించారు. అలాంటి ఒత్తిడి సమయంలో మైదానంలో ఉన్న సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్ అతని దగ్గరకు వచ్చి ప్రశాంతంగా ఉండమని, బంతిని దగ్గరగా చూసి ఆడమని చెప్పాల్సింది అని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆ చిన్న సలహా వైభవ్ సూర్యవంశిని స్థిరపడేలా చేసేదని అశ్విన్ పేర్కొన్నారు. కానీ సంజు శాంసన్ అలా చేయలేకపోయాడని ఆయన అన్నారు.

ఒకవేళ మూడో టీ20లో ఇదే బ్యాటర్లు బరిలోకి దిగితే, అందులో వైభవ్ సూర్యవంశి మూడో స్థానంలో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడాల్సి వస్తే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని అశ్విన్ సూచించారు. ఓపెనర్‌ను ఓపెనర్‌గానే పంపించి, సంజు శాంసన్‌ను నెంబర్ త్రీ స్థానానికి మార్చడం ఉత్తమమని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. గతంలో ఆసియా గేమ్స్‌లో కూడా సంజు శాంసన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసి మంచి ప్రదర్శన కనబరిచాడని అశ్విన్ గుర్తుచేశారు. వైభవ్ సూర్యవంశికి మూడో స్థానం ఏ మాత్రం సెట్ కాదని అశ్విన్ తేల్చి చెప్పారు.

అదే సమయంలో భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్‌ల ప్రదర్శనను రవిచంద్రన్ అశ్విన్ కొనియాడారు. ఇండియన్ మిడిల్ ఆర్డర్, ముఖ్యంగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అన్నారు.

మిచెల్ శాట్నర్ లాంటి అగ్రశ్రేణి స్పిన్నర్‌ను నిలబడి సిక్సర్లు కొట్టడం నమన్ ధీర్ ఆత్మవిశ్వాసాన్ని తెలుపుతుందని, తిలక్ వర్మ ప్రశాంతత అద్భుతంగా ఉందని అశ్విన్ ప్రశంసించారు. ప్రత్యర్థి జట్లను భయపెట్టే రేంజ్‌లో భారత మిడిల్ ఆర్డర్ తయారైందని రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలతో ముగించారు.