
తొలి వన్డేలో ఇంగ్లాండ్ భారత్ కు 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.

249 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టుకు పవర్ ప్లేలోనే ఊహించని షాక్ తగిలింది. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్త రాసే సమయానికి శుభ్‌మాన్ గిల్ (3), శ్రేయాస్ అయ్యర్ (23) క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 15, రోహిత్ శర్మ 2 పరుగులకే పెవిలియన్ చేరి నిరాశ పరిచారు.

ఆరో ఓవర్లోనే భారత్ రెండో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 7 బంతుల్లో 2 పరుగులు చేసిన తర్వాత క్యాచ్ అవుట్ అయ్యాడు. సాకిబ్ మహ్మద్ బౌలింగ్‌లో మిడ్-ఆన్‌లో లియామ్ లివింగ్‌స్టోన్ అద్భుత క్యాచ్‌తో హిట్ మ్యాన్ ఎటువంటి మెరుపులు లేకుండా పెవిలియన్ చేరాడు.

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ మరోసారి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చాడు. మొత్తంగా 2024/25 సీజన్‌లో మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో 10.37 సగటుతో 166 పరుగులు చేశాడు.

2024/25 సీజన్‌లో రోహిత్ శర్మ చేసిన పరుగులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2గా ఉన్నాయి.