
బీబీఎల్ 2021-22 సీజన్‌లోని 23వ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ 20 పరుగుల తేడాతో బ్రిస్బేన్ హీట్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా, బ్రిస్బేన్ జట్టు 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ హీట్ కేవలం 16 పరుగులకే మెల్బోర్న్ స్టార్స్ తరపున 3 వికెట్లు పడగొట్టింది. కానీ, ఆ తర్వాత వారి బౌలర్లు చాలా పేలవంగా బౌలింగ్ చేయడం ద్వారా పరుగులు ఇచ్చారు. ఫాస్ట్ బౌలర్ లియామ్ గుత్రీ బ్రిస్బేన్ తరుపున పరుగులు ఇవ్వడంలో మొదటి స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా టీ20 చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ చేసి అవాంఛిత రికార్డు సృష్టించాడు.

మెల్‌బోర్న్ స్టార్స్‌పై లియామ్ గుత్రీ 4 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. ఇది బిగ్ బాష్ లీగ్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా టీ20 చరిత్రలో చెత్త బౌలింగ్ గణాంకాలుగా మిగిలాయి.

లియామ్ గుత్రీ తన మొదటి ఓవర్‌లోనే జో బర్న్స్ వికెట్ తీసుకున్నాడు, అయితే ఆ తర్వాత అతను చాలా పేలవంగా బౌలింగ్ చేశాడు. గుత్రీని చిత్తుచేసేందుకు కార్ట్‌రైట్, జో క్లార్క్ జతకట్టారు. గుత్రీ వేసిన 4 ఓవర్లలో 7 సిక్సర్లు బాదేశారు.

టీ20 క్రికెట్ చరిత్రలో గుత్రీ నాల్గవ అత్యంత ఖరీదైన బౌలింగ్‌ని వేశాడు. సియాల్‌కోట్ బౌలర్ సర్మద్ అన్వర్ 4 ఓవర్లలో 81 పరుగులిచ్చి టీ20 చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్ వేశాడు. నార్దాంటా బౌలర్ శాండర్సన్ 4 ఓవర్లలో 77 పరుగులు ఇచ్చాడు. శ్రీలంక బౌలర్ రజిత 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు.

లియామ్ గుత్రీ పశ్చిమ ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ 12 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు.