
బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది. అయితే, ఈ చెత్త నిర్ణయంతో ఐసీసీకే షాక్ అంటూ ప్రగల్భాలు పలికింది. మాకేం నష్టం లేదంటూ పాకిస్తాన్ మాటలు నమ్మి బలైంది. ఈ నిర్ణయం కేవలం ఆటగాళ్ల అవకాశాలను దెబ్బతీయడమే కాకుండా, బంగ్లా బోర్డు ఆర్థిక పునాదులను కదిలించేలా ఉంది. ఐసీసీ (ICC) నిర్వహించే మెగా టోర్నీల ద్వారా వచ్చే ఆదాయమే చాలా దేశాల క్రికెట్ బోర్డులకు ప్రధాన వనరుగా మారింది. మరి ఇలాంటి పరిస్థిలో బంగ్లా బోర్డు తన గోతిని తనే తవ్వుకుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఐసీసీ తన వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని సభ్య దేశాలకు పంచుతుంది. ప్రపంచకప్‌ను బహిష్కరించడం వల్ల బంగ్లాదేశ్ ఈ వాటాను కోల్పోవాల్సి వస్తుంది. ప్రపంచకప్ సమయంలో బంగ్లాదేశ్ ఆడే మ్యాచ్‌లకు భారీగా యాడ్ రెవెన్యూ వస్తుంది. బహిష్కరణ వల్ల స్థానిక, అంతర్జాతీయ స్పాన్సర్‌లు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టోర్నీలో పాల్గొన్నందుకు, గ్రూప్ దశలో సాధించే విజయాల ఆధారంగా ఐసీసీ ఇచ్చే ప్రైజ్ మనీని కూడా బోర్డు నష్టపోతుంది.

బంగ్లాదేశ్ వంటి ఎదుగుతున్న క్రికెట్ దేశానికి రూ. 240 కోట్లు అనేది చిన్న మొత్తం కాదు. ఈ సొమ్మును దేశంలో అకాడమీల నిర్వహణకు, యువ ఆటగాళ్ల శిక్షణకు, దేశవాళీ టోర్నీలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ నిధులు రాకపోతే, బంగ్లాదేశ్ క్రికెట్ మౌలిక సదుపాయాలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఐసీసీ నుంచి ఆంక్షలు లేదా భవిష్యత్తు టోర్నీలపై నిషేధం పడే అవకాశం కూడా లేకపోలేదు.

బోర్డు తీసుకునే నిర్ణయం వల్ల ప్రతిభావంతులైన ఆటగాళ్ల కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచ వేదికపై తమ సత్తా చాటాలని ఆరాటపడే యువ క్రికెటర్లు ఈ బహిష్కరణ వార్తతో నిరాశలో ఉన్నారు. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ నాణ్యతను కొన్ని దశాబ్దాల వెనక్కి నెట్టివేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వినిపిస్తున్నా, బంగ్లాదేశ్ విషయంలో అది సాధ్యపడటం లేదు. రూ. 240 కోట్ల నష్టాన్ని భరించి మరీ బహిష్కరణకు వెళ్లడం బీసీబీకి ఆత్మాహుతి నిర్ణయం లాంటిదే.