
BAN vs NZ, 3rd ODI: న్యూజిలాండ్‌తో ఢాకా వేదికగా జరుగుతున్న మూడో వన్డేల్లో బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసిన మహ్మదుల్లా.. వ్యక్తిగత స్కోర్ 1 వద్ద వన్డేల్లో 5 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

తద్వారా బంగ్లాదేశ్ తరఫున వన్డే క్రికెట్‌లో 5000 పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా అరుదైన లిస్టులో స్థానం పొందాడు.

బంగ్లా తరఫున మహ్మదుల్లా కంటే ముందు తమీమ్ ఇక్బాల్ (243 మ్యాచ్‌ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (256 వన్డేల్లో 7406), షకీబ్ అల్ హసన్ (240 మ్యాచ్‌ల్లో 7384 పరుగులు) 5000 వన్డే పరుగులు చేశారు.

కాగా, ఇప్పటివరకు 221 వన్డేలు ఆడిన ఆల్‌రౌండర్ మహ్మదుల్లా మొత్తంగా 3 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు, 82 వికెట్లు తీసుకున్నాడు.

ఇదిలా ఉండగా, నేటి మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 171 పరుగులకే పరిమితమైంది. దీంతో 172 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బ్లాక్ కాప్స్ ఇప్పటివరకు జరిగిన 18 ఓవర్ల ఆటలో 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది.