పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 టోర్నీలో 5 అర్ధసెంచరీలు, 1 సెంచరీ సాధించడం ద్వారా పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ టీ20 క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ, వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మ్యాన్ క్రిస్ గేల్ రికార్డులను బద్దలుకొట్టాడు.
అదేమిటంటే.. ఇంతకముందు వరకు కూడా టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన ప్రపంచ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. వెస్టిండీస్ తరఫున విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడే క్రిస్‌గేల్ మొత్తం 249 ఇన్నింగ్స్‌లలో 9 వేల పరుగులు పూర్తి చేశాడు.
అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 271 టీ20 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఇప్పుడు వీరిద్దరినీ అధిగమించి బాబర్ ఆజం సరికొత్త రికార్డు సృష్టించడం విశేషం.
బాబర్ ఆజం కేవలం 245 టీ20 ఇన్నింగ్స్‌ల్లోనే 9000కు పైగా పరుగులు సాధించాడు. దీని ద్వారా గతంలో క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును పాకిస్థాన్ జట్టు కెప్టెన్ తన పేరిట లిఖించుకున్నాడు.
కాగా, ఈసారి పీఎస్‌ఎల్‌లో పెషావర్ జల్మీ తరఫున ఆడుతున్న బాబర్ అజామ్ 11 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 522 పరుగులు చేశాడు. అయితేనేం జట్టును ఫైనల్‌కు చేర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడు.