
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాతో ఫైనల్ ఆడుతున్న టీమిండియా.. తొలి రోజు నుంచి ఆసీస్ కంటే కాస్త వెనుకబడింది. తొలుత ఆసీస్ జట్టును స్వల్ప మొత్తానికి కట్టడి చేయడంలో విఫలమైన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్ లోనూ తడబడింది.

అయితే భారత్ తరపున ధీటుగా బ్యాటింగ్ చేసిన అజింక్య రహానే.. టీమ్ ఇండియాను క్లిష్ట పరిస్థితి నుంచి కాపాడేందుకు తన ప్రయత్నం చేశాడు. ఆసీస్ పేసర్ల దాడిని సమర్థంగా ఎదుర్కొని తన టెస్టు కెరీర్‌లో 26వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

అతను తన ఇన్నింగ్స్‌లో 1 సిక్స్, 6 బౌండరీలతో 92 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో రహానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.

టెస్టు క్రికెట్‌లో రహానే 5000 పరుగులు కూడా పూర్తి చేశాడు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టు ఆడిన రహానే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఫ్లాప్ అయ్యాడు. ఆ తర్వాత అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు రహానే హాఫ్ సెంచరీతో టీమిండియాకు అద్భుతంగా పునరాగమనం చేశాడు.

దీంతో పాటు ఫీల్డింగ్ లోనూ సెంచరీ పూర్తి చేసిన రహానే.. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ క్యాచ్ పట్టడంతో టెస్టు క్రికెట్ లో వంద క్యాచ్‌లు పూర్తి చేశాడు. రహానే కంటే ముందు వీవీఎస్ లక్ష్మణ్ (135 క్యాచ్‌లు), సచిన్ టెండూల్కర్ (115), విరాట్ కోహ్లీ (109), సునీల్ గవాస్కర్ (108), మహ్మద్ అజారుద్దీన్ (105) టెస్టుల్లో 100 క్యాచ్‌ల రికార్డును లిఖించారు.