
ఆగస్ట్ 15 వీకెండ్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. తెలుగు నుంచి ఏ సినిమా అధికారికంగా పంద్రాగస్ట్ రేసులో నిలబడలేదు గానీ చిరంజీవి విశ్వంభర మాత్రం అదే సీజన్‌లో రానుందని తెలుస్తుంది. జులై 24 మిస్ అయితే.. ఆగస్ట్ రెండో వారంలో సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. మరోవైపు రజినీకాంత్ కూలీ అదే సీజన్‌లోనే రానుంది.

లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్ర షూటింగ్ పూర్తైంది. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.

మరోవైపు అదేరోజు వార్ 2 విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. వార్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. తారక్ ఉన్నారు కాబట్టి సౌత్‌లోనూ భారీ ఓపెనింగ్స్ ఖాయం.

మరి కూలీ ఈ సినిమాతో పోటీ పడుతుందా లేదా అనేది చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా ఆగస్ట్ 15 రేసులో కన్నడ సినిమా 45 కూడా చేరిపోయింది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.

సోషియో ఫాంటసీగా 45 సినిమాను తెరకెక్కిస్తున్నారు అర్జున్ జన్యా. కన్నడ నుంచి 45.. తమిళం నుంచి కూలీ.. హిందీలో వార్ 2.. ఇలా ఎవరికి వాళ్లు పంద్రాగస్ట్ వీకెండ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి వీళ్లలో ఎవరు చివరి వరకు రేసులో నిలుస్తారనేది చూడాలి. కానీ ఎవరొచ్చినా.. లాంగ్ వీకెండ్ ఆ సినిమాలకు బాగా హెల్ప్ కానుంది.