
యాంకర్ రవి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భమేదైనా, వేదిక ఏదైనా సమయస్ఫూర్తితో రవి వేసే పంచులు, జోకులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రవి, లాస్య కాంబినేషన్ లో వచ్చిన టీవీ షోలు బుల్లితెర ఆడియెన్స్ ను బాగా అలరించాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో హవా సాగిస్తోన్న మేల్ యాంకర్లలో రవి కూడా ఒకరు. ముఖ్యంగా పటాస్ కామెడీ షో తో రవికి బాగా పేరు వచ్చింది. ఇందులో శ్రీముఖితో కలిసి రవి చేసిన అల్లరి మాములుగా లేదు.

కాగా బుల్లితెరపై అడుగు పెట్టిన చాలా ఏళ్లకు కానీ తనకు పెళ్లైన విషయం, ఒక పాప కూడ ఉందన్న విషయాలను అసలు బయటకు చెప్పలేదు రవి.

అయితే సుమారు ఐదేళ్ల క్రితం ఒక సోషల్ మీడియా పోస్టుతో తనకు నిత్యా సక్సేనా అనే అమ్మాయితో పెళ్లైందని, కూతురు వియా ఉందంటూ బాంబు పేల్చాడు.

ఇక అప్పటి నుంచి తన భార్య, కూతురు ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు రవి. ఇదిలా ఉంటే సోమవారం (అక్టోబర్ 1) రవి, నిత్యల పెళ్లిరోజు.

ఈ సందర్భంగా తన ఫ్యామిలీకి సంబంధించిన పలు అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడీ స్టార్ యాంకర్. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రవి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.