
ఇండస్ట్రీలో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ మాట్లాడుతుంటే అభిమానులకు భలే ఆనందంగా ఉంది. సంతోషించాల్సిన విషయం కాకపోయినా, అందరిలోనూ సమైక్యత వచ్చినందుకు హ్యాపీగా ఉందంటున్నారు ఫ్యాన్స్.

కష్టం వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉండాలనే కదా మనం కోరుకున్నది అని మాట్లాడుకుంటున్నారు. నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ఫలానా అంటూ కొండా సురేఖ అన్న మాటలు ఇండస్ట్రీలో అగ్గి రాజేశాయి.

అలా ఎలా అంటారు? మా కుటుంబాన్ని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారంటూ స్పందించారు నాగ్. కెరీర్ ప్రారంభంలో ఏమాయ చేసావె సినిమాతో సిల్వర్‌స్క్రీన్ మీద మెప్పించిన చై - సామ్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేశారు.

సినిమా వాళ్లంటే అంత సాఫ్ట్ టార్గెట్ ఏంటి? వారి వ్యక్తిగత విషయాలను వీధుల్లో పెట్టే హక్కు మీకెవరిచ్చారు? అసలు అవేం మాటలు? పరిశ్రమలో అమ్మాయిల గురించి ఇలాగే మాట్లాడతారా? మహిళ అయి ఉండి మీరు మాట్లాడాల్సిన తీరు ఇదేనా... ఇంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎలా చేయగలిగారు అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు ట్వీట్ల పరంపరను కొనసాగించారు.

చై - సామ్ విడాకుల గురించి ఇలాంటి వార్తలు వినడం బాధాకరమే అంటున్నారు ఫ్యాన్స్. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటే, ఇండస్ట్రీలోని వ్యక్తులను ఇతరులు అనుచితంగా అంటే.. మిగిలిన సెలబ్రిటీలు చూస్తూ ఊరుకోరు అని ఈ సందర్భంగా ప్రూవ్ చేయడం మాత్రం గ్రేట్ అంటున్నారు అభిమానులు.