
తెలుగు ఇండస్ట్రీలో తెలుగుమ్మాయిల టైమ్ మొదలైందా..? ఇన్నేళ్లూ పక్క ఇండస్ట్రీ నుంచి.. పక్క రాష్ట్రాల నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్న దర్శక నిర్మాతలకు ఇప్పుడా కరువు తీరిపోయినట్లేనా..? ధమాకా, బేబీ లాంటి సినిమాలు మన అమ్మాయిల సత్తా చూపించాయి. మరి ఈ సక్సెస్ తెలుగమ్మాయిల జాతకాన్ని మార్చేస్తుందా..? ఇప్పటికైనా బయటికొస్తారా.. వాళ్లకు మన మేకర్స్ ఛాన్సులిస్తారా..?

తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ఛాన్సులు రావు.. వచ్చినా పెద్దగా సక్సెస్ అవ్వరు.. చాలా కాలంగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన పదం ఇది. అప్పుడప్పుడూ కలర్స్ స్వాతి, బిందు మాధవి, ఈషా రెబ్బా, అంజలి లాంటి హీరోయిన్లు వచ్చినా.. టాలీవుడ్ కంటే పక్క భాషల్లోనే ఎక్కువగా అవకాశాలు అందుకున్నారు.. సక్సెస్ అయ్యారే తప్ప మన దగ్గర మాత్రం వాళ్లకు క్రేజ్ రాలేదు.

ఈ మధ్యే తెలుగమ్మాయిలకు ఇండస్ట్రీలో ఛాన్సులొస్తున్నాయి. గ్యాప్ లేకుండా వరస సినిమాలతో ఇండస్ట్రీని కమ్మేసిన శ్రీలీల ఇక్కడమ్మాయే. స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది.. పుట్టి పెరిగింది బెంగళూరు అయినా శ్రీలీల మూలాలున్నది ఇక్కడే. చిరంజీవి సైతం తెలుగమ్మాయిలను ఎంకరేజ్ చేయాలని ఆ మధ్య ఫస్ట్ డే ఫస్ట్ షో ఈవెంట్‌లో మాట్లాడారు.

మొన్నటికి మొన్న లవ్ యూ రామ్ అనే సినిమా ఈవెంట్‌లోనూ హరీష్ శంకర్ ఇదే చెప్పారు. తెలుగమ్మాయిలకు ఛాన్సులివ్వడానికి రెడీగానే ఉన్నామన్నారు. ఇక బేబీ సక్సెస్ మీట్‌లో బన్నీ అయితే వైష్ణవి చైతన్యను ఆకాశానికి ఎత్తేసారు. తెలుగమ్మాయిలు ఎందుకు రావట్లేదనే బాధ ఎప్పట్నుంచో ఉందని చెప్పుకొచ్చారు బన్నీ.

శ్రీలీల మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తుందని.. అలాగే వైష్ణవి కూడా అలాగే చేస్తుందని.. తెలుగమ్మాయిలు ఇప్పట్నుంచి బయటికి రావాలని.. వస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు అల్లు అర్జున్.