ఒక్క హిట్‌తోనే.. గోడకు కొట్టిన బంతిలా కమ్ బ్యాక్ ఇచ్చారు కమల్ హాసన్. విక్రమ్ తర్వాత ఈయన జోరు చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మాల్సిందే. ఒక్కటో రెండో కాదు.. ఏకంగా నాలుగు సినిమాలకు సైన్ చేసారు కమల్. అవి కూడా అల్లాటప్పా సినిమాలేం కాదు.. చిన్న దర్శకులు కాదు.
కమల్ కోసం సెన్సేషనల్ డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. మరి ఏంటా సినిమాలు.? ఎవరా దర్శకులు.? ఎంత పెద్ద హీరో అయినా.. ఫ్లాపుల్లో ఉన్నపుడు మార్కెట్ పడిపోవడం కామన్. కానీ అదే హీరోకు ఒక్క సాలిడ్ బ్లాక్‌బస్టర్ పడిందంటే బాక్సాఫీస్ దగ్గర చెడుగుడు ఆడుకుంటారు.
కమల్ హాసన్ కూడా విక్రమ్‌తో ఇదే చేసారు. 20 ఏళ్ళ ఆకలిని తీర్చేసుకున్నారు లోకనాయకుడు. 400 కోట్లకు పైగా వసూలు చేసిన విక్రమ్ తమిళ సినిమా రికార్డుల్ని సైతం కదిలించింది. విక్రమ్ విజయం తర్వాతే కమల్ ఆగిపోయిన సినిమాల్లోనూ కదలిక వచ్చింది.
రెండేళ్ళుగా మూలన పడిన ఇండియన్ 2 సెట్స్‌పైకి రావడంలో విక్రమ్ పాత్ర కీలకం. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024లోనే విడుదల కానుంది. ఇదిలా ఉంటే దీని తర్వాత కమల్ లైనప్ చూస్తే కళ్లు తేలేయాల్సిందే..
శంకర్ తర్వాత లైన్‌లో తునివు ఫేమ్ హెచ్ వినోద్.. మణిరత్నం.. లోకేష్ కనకరాజ్ ఉన్నారు. అజిత్‌తో నేర్కొండ పార్వై, వలిమై, తునివు సినిమాలు చేసిన వినోద్ దర్శకత్వంలో కమల్ ప్రస్తుతం సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. మరోవైపు మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. నాయకుడు తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
మణిరత్నం తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం రజినీకాంత్ కోసం కథ సిద్ధం చేస్తున్న లోకేష్.. ఆ తర్వాత విక్రమ్ సీక్వెల్ చేయనున్నారు. మొత్తానికి కమల్ దూకుడు చూస్తుంటే మరో ఐదేళ్ల వరకు ఈయన డైరీ ఫుల్ అయినట్లే కనిపిస్తుంది.