
సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శ్రుతి హాసన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. నటిగా మాత్రమే కాకుండా సింగర్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా శ్రుతి హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని బయటకు చెప్పడానికి తాను పడిన ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్.. తన వ్యక్తిగత అనుభవాలను ఓపెన్‌గా పంచుకుంది. తనకు PCOS సమస్య ఉండటంతో పీరియడ్స్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపింది. చిన్నప్పటి నుంచే పీరియడ్స్ తనకు చాలా బాధాకరంగా ఉండేవని చెప్పిన శ్రుతి.. కొన్ని సందర్భాల్లో విపరీతమైన నొప్పితో పాటు వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయని తెలిపింది. కొన్నిసార్లు పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేదని తన అనుభవాలను వివరించింది.

సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్య తనకు మరింత ఇబ్బందికరంగా మారిందని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనేటప్పుడు కడుపునొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేక చాలా ఇబ్బంది పడేదానినని తెలిపింది. తనకు ఏదైనా సమస్య ఉందని చెప్పడం కంటే.. దాన్ని దాచుకోవడమే మంచిదని అప్పట్లో భావించేదానినని చెప్పింది. అయితే అలా తన సమస్యను దాచుకోవడం వల్ల తాను ఎందుకు డల్‌గా, ఎనర్జీ లేకుండా కనిపిస్తున్నాననే విషయం చుట్టుపక్కల వారికి అర్థం కాకపోయేదని పేర్కొంది.

అయితే ఒకసారి తనతో కలిసి పనిచేస్తున్న ఓ ఆర్టిస్ట్‌కు సర్జరీ జరగడంతో అతని పరిస్థితిని మేకర్స్‌కు వివరించగా.. వారు అతనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని శ్రుతి తెలిపింది. అంతేకాదు, అతనికి ఇబ్బంది కలగకుండా షూటింగ్ సమయాలను సైతం మార్చారని చెప్పింది. ఆ సంఘటనను చూసిన తర్వాత తాను కూడా తన సమస్యను మేకర్స్‌కు చెబితే వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం కలిగిందని తెలిపింది. ఆ తర్వాత ఓ దర్శకుడికి తన పీరియడ్స్ సమస్య గురించి చెప్పానని, ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడికి కూడా కుమార్తె ఉండటంతో తనకు మరింత ధైర్యం వచ్చిందని వెల్లడించింది.

అప్పటి నుంచి తన సమస్యను దాచుకోకుండా అవసరమైనప్పుడు ఓపెన్‌గా చెప్పడం ప్రారంభించానని శ్రుతి హాసన్ పేర్కొంది. ఇదే సందర్భంలో శ్రుతి హాసన్ మగవాళ్లపై సరదాగా సెటైరికల్ కామెంట్ చేసింది. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది. అలా జరిగితే హీరోయిన్లతో కుదుర్చుకునే కాంట్రాక్టుల్లో పీరియడ్స్ విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి.. వారికి హాలిడేస్ ఇచ్చేవారేమో అంటూ సరదాగా చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.