Basha Shek |
Aug 12, 2023 | 9:45 AM
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' ఆగస్ట్ 10న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 72 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డుల మోత మోగించింది. దీంతో జైలర్ చిత్ర బృందమంతా సంబరాల్లో మునిగితేలుతోంది.
అయితే సింప్లిసిటీకి కేరాఫ్‌గా నిలిచే రజనీ కాంత్ మాత్రం ఇప్పుడు హిమాలయాల్లో సేద తీరుతున్నారు. చాలా కాలం తరువాత అక్కడికి వెళ్లిన ఆయన.. ప్రశాంత వాతావరణంలో మనశ్శాంతిని పొందుతున్నారు.
ఉత్తరాఖండ్‌లోని హృషీకేశ్‌లోని దయానంద సరస్వతి ఆశ్రమంలో రజనీకాంత్ నివాసం ఉంటున్నారు. అక్కడున్న రుషులు, భక్తులతో కలిసి సేద తీరుతున్నారు సూపర్ స్టార్. ర జనీకాంత్ హిమాలయాల ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతున్నాయి.
తెల్లటి కుర్తా, పైజామా ధరించి, నుదుటిపై బొట్టు పెట్టుకుని రజనీ చాలా సింపుల్‌గా ఉన్నారు. అక్కడ గురువుల ప్రసంగాలు వినడంతో పాటు ఆశ్రమంలోని ఇతర నివాసితులతో ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొంటున్నారు. కాగా రజనీకాంత్‌కి హిమాలయాలు కొత్తేమీ కాదు. గతంలోనూ పలుసార్లు ఇక్కడికి వచ్చారు.
ఇక నెల్సన్ తెరకెక్కించిన జైలర్ సినిమాలో రజనీతో పాటు రమ్యకృష్ణ, శివరాజకుమార్, మోహన్‌లాల్, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రికార్డులు కొల్లగొడుతోంది.