
తెలుగు సినిమా స్వర్ణయుగంలో మకుటం లేని మహారాణిగా వెలిగిన సావిత్రి జీవితం, ఆమె పోషించిన పాత్రల వలెనే నాటకీయమైన విషాదంతో ముగిసింది. నటిగా అద్భుతమైన విజయాలు సాధించినా, నిజజీవితంలో ఆమె అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహారాణిలా జీవించిన ఆమె, చివరికి అనామకంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. నూరేళ్ల మధురమైన కాలాన్ని 45 ఏళ్లకే శోకమయం చేస్తూ ఆమె వెళ్ళిపోవడం అనేకమందికి విచారం కలిగించింది. తాను అసహ్యించుకున్న ఈ ప్రపంచంలోనే ఏడాదిన్నర పాటు విగతజీవిలా పడి ఉండి, చివరికి 1981 డిసెంబర్ 26న నిశ్శబ్దంగా సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

మద్రాసులో తండ్రి చౌదరి సంరక్షణలో ఉన్నప్పుడు మౌంట్ రోడ్డు, థౌసండ్ లైట్స్ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉన్న సావిత్రి, తొలిసారిగా 1958 మార్చి 1న టి.నగర్ హబీబుల్లా రోడ్డులో రెండంతస్తుల మేడను నిర్మించారు. ఆ తర్వాత నాలుగు ఇళ్లు కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు సారంగపాణి వీధిలో ఉన్న తన ఇంటిని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుకు అమ్మగా, సావిత్రి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఇవి కాక మరో నాలుగు ఇళ్లు, ఊటీలో ఒక బంగళా ఆమెకు ఉండేవి. జెమినీ గణేషన్ తో వివాహం విఫలమై, నిర్వేదం ఆవరించిన తరువాత ఆమె మత్తును ఆశ్రయించారు. దీని కారణంగా ఆమె ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. చివరి రోజులను అన్నానగర్ లోని ఒక చిన్న అద్దె ఇంట్లో గడిపారు.

1980 మే నెలలో ఒక కన్నడ చిత్రం షూటింగ్ కోసం సావిత్రి బెంగళూరు వెళ్లారు. మే 10న షూటింగ్‌లో పాల్గొని హోటల్ గదికి చేరుకున్న తర్వాత తీవ్రమైన అస్వస్థతకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం ఆమె స్పృహలో లేకపోవడం, నోటిలో నుంచి నురగ కారడం గమనించిన హోటల్ సిబ్బంది, యూనిట్ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా, ఆసుపత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించారు. అంతకుముందే మలయాళ నటి శుభ ఆత్మహత్యకు ప్రయత్నించి, ఆసుపత్రిలో మరణించడంతో ఆమె బంధువులు ఆసుపత్రిపై దాడి చేయడంతో ఆ ఆసుపత్రి సావిత్రిని చేర్చుకోవడానికి భయపడింది. మరో రెండు ఆసుపత్రులు కూడా ఇదే విధంగా నిరాకరించడంతో, చేసేదేమీ లేక శివాజీ నగర్ బస్టేషన్ దగ్గర ఉన్న బేరింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో సావిత్రిని చేర్చారు.

మూడు రోజులపాటు వైద్యులు ప్రయత్నించినా ఆమెలో ఎటువంటి గుణమూ కనిపించకపోవడంతో, మానసిక వ్యాధి నిపుణుడు డాక్టర్ శ్రీనివాసన్ సావిత్రిని పరీక్షించి, మానసికంగా ఆమె బాగానే ఉన్నారని నిర్ధారించారు. అన్ని పరీక్షల తర్వాత ఆమె కోమాలోకి వెళ్ళిపోయారని, బ్రెయిన్ సెల్స్ చాలా వరకు దెబ్బతిన్నాయని వైద్యులు తేల్చారు. సావిత్రి అస్వస్థతకు గురయ్యారని తెలిసినప్పుడు జెమినీ గణేషన్ మలేషియాలో ఉన్నారు. ఆయన తన మొదటి భార్య బాబ్జీని, సావిత్రి కూతురు చాముండేశ్వరిని వెంటనే బెంగళూరు పంపించారు. మే 18న జెమినీ గణేషన్ కూడా బెంగళూరు చేరుకుని, సావిత్రిని పలకరించగా, ఆమె అతి కష్టం మీద ఒక్క క్షణం కళ్ళు విప్పి భర్తను చూసి కన్నీరు పెట్టుకున్నారు కానీ నోట మాట రాలేదు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ అనేకసార్లు ఆసుపత్రికి వచ్చి సావిత్రిని చూసి వెళ్లారు.

మే 27 వరకు చూసి, అపస్మారక స్థితిలో ఉన్న సావిత్రిని మద్రాస్‌కు తీసుకువచ్చి, లేడీ వెల్లింగ్టన్ ఆసుపత్రిలో మూడు నెలలపాటు చికిత్స చేయించారు. తర్వాత ఆమెను అన్నానగర్ లోని ఆమె అద్దెకుంటున్న ఇంటికి తీసుకువెళ్లారు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. సావిత్రి మంచానికి అతుక్కుపోయి సంవత్సరం గడిచింది. అలా పడుకుని ఉండటం వల్ల వీపంతా పుళ్ళు పడ్డాయి. పత్రికల్లో ఆమె అపస్మారక స్థితి గురించి వార్తలు చూసి, విజయవాడలోని హోమియో వైద్యుడు డాక్టర్ వాసు కదిలిపోయి, తన వైద్యంతో ఆమెను బాగు చేయగలనని నమ్మకంతో మద్రాస్ చేరుకుని కుటుంబ సభ్యుల అనుమతితో వైద్యం ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు కూడా ఆమెను పరామర్శించారు. తెలుగు, తమిళ ప్రేక్షకులు సావిత్రి కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.

సావిత్రి వైద్యానికి అవుతున్న ఖర్చులో చాలా భాగం ఆమె అన్నానగర్ కు వచ్చిన తర్వాత సంపాదించుకున్న డబ్బులోనిదే. అంతకుముందు ఆమె సంపాదించిన సంపద అంతా ఆదాయపు పన్ను అధికారులు జప్తు చేశారు. బ్యాంకు ఖాతాలు కూడా జప్తు చేయబడ్డాయి. కోమాలోకి వెళ్ళిన 596వ రోజు అంటే, 1981 డిసెంబర్ 26 రాత్రి 10:30 గంటలకు మహానటి తుది శ్వాస విడిచారు. అయితే, సావిత్రికి మరణం లేదు. ఆమె జ్ఞాపకాలు, ఆమె అద్భుతమైన నటనా ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.