
సినిమా పరిశ్రమలో ఒకరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. కోట్ల రూపాయలు సంపాదించే సూపర్‌స్టార్లు, పెద్ద హీరోయిన్లు నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ సరిగ్గా రెండేళ్ల క్రితం, 2024 జూన్ 7న, ఒక సినిమా థియేటర్లలోకి వచ్చి పరిశ్రమలోని లెక్కలన్నింటినీ మార్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్ ఎవరూ లేకుండా, ఈ సినిమా కేవలం ఒకే కథ బలంతో బాక్సాఫీస్ వద్ద డబ్బు సంపాదించింది. ఈ సినిమా మ్యాడాక్ ఫిల్మ్స్ వారి సూపర్ హిట్ 'ముంజ్యా'. ఈ హారర్-కామెడీ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వైరలవుతుంది.

'స్త్రీ', 'భేదియా' విజయాల తర్వాత దినేష్ విజన్ 'ముంజ్యా'ను ప్రకటించినప్పుడు, చాలామంది ఇది ఒక చిన్న ప్రయోగం అవుతుందని భావించారు. కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్‌లో సగం, అంటే సుమారు 15 కోట్ల రూపాయలు, కేవలం 'ముంజ్య' పాత్ర విఎఫ్ఎక్స్ , యానిమేషన్‌ను రూపొందించడానికే ఖర్చు చేశారు. ఈ డిజిటల్ దెయ్యాన్ని నిజంగా, సజీవంగా కనిపించేలా చేయడానికి చిత్రనిర్మాతలకు పూర్తి ఒక సంవత్సరం పట్టింది. కానీ ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చినప్పుడు, దాని విలక్షణమైన కథ, అద్భుతమైన విఎఫ్ఎక్స్, కొంకణి సంస్కృతి స్పర్శకు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా కథ మహారాష్ట్రకు చెందిన ఒక పాత జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ కథ ప్రకారం, 'ముంజ్య' అనే ఒక యువకుడి దెయ్యం పెళ్లి చేసుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటుంది. ఈ దెయ్యం బిట్టును వెంటాడటం మొదలుపెట్టడంతో, అతని కుటుంబం మొత్తం మీద పడిన శాపం బయటపడుతుంది. 'బిట్టు' పాత్రలో అభయ్ వర్మ తన సహజ నటనతో, అద్భుతమైన హాస్య సమయస్ఫూర్తితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. నటి శర్వరి వాఘ్ 'బేలా' పాత్రకు ఎంతటి జీవం పోసిందంటే, ఈ ఒక్క సినిమానే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.

ఇది కాకుండా, బిట్టు తల్లి పాత్రలో మోనా సింగ్ నటించగా, 'కట్టప్ప' ఫేమ్ దక్షిణాది నటుడు సత్యరాజ్ పోషించిన టెక్నీషియన్ 'ఎల్విస్ కరీం ప్రభాకర్' పాత్ర బాగా ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం తొలిరోజే అనూహ్యంగా 4.21 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తొలి వారంలోనే రూ. 35 కోట్ల మార్కును, రెండు వారాల్లో రూ. 70 కోట్ల మార్కును దాటింది. భారతదేశంలో ఈ చిత్రం మొత్తం రూ. 107.48 కోట్ల నికర వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ బడ్జెట్ చిత్రం రూ. 132.13 కోట్ల బంపర్ కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించింది.

కథకు సరైన పస ఉంటే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి పెద్ద స్టార్స్ అవసరం లేదని 'ముంజ్యా' నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. హిందీ, మరాఠీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. హారర్ సినిమా.. ఆద్యంతం భయపెట్టే సన్నివేశాలు.. ఊహించని మలుపులతో ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఓటీటీలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. రెండేళ్లు గడిచినప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.