టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ మువీలో దేవ్ మోహన్ దుష్యంతుని పాత్రలో నటించాడతడు. ఇక ప్రస్తుతం మరో అగ్ర కథానాయిక రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రెయిన్‌బో’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అరంభంలోనే ఇద్దరు అగ్ర హీరోయిన్ల సరసన కనిపించనుండడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే మలయాళ నటుడు దేవ్ మోహన్.
కేరళలోని త్రిశ్శూర్‌కు చెందిన దేవ్ మోహన్ మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి.. బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడు. దేవ్‌కు చిన్నప్పటి నుంచీ వ్యాయామం చేసే అలవాటుండడంతో ఓ స్నేహితుడి సలహా మేరకు 2016లో ముంబయిలో నిర్వహించిన మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే వారాంతాల్లో ఫ్యాషన్ షోల్లో దేవ్ పాల్గొనేవాడు.
ఇలా దేవ్ మోడలింగ్ చేసే సమయంలో తన స్నేహితుడు ఓ నిర్మాణ సంస్థ కొత్త హీరోలను వెతుకుతోందని చెప్పడంతో ఆడిషన్‌కు వెళ్లాడు. సెలక్ట్ అవడంతో తొలి సినిమా ‘సూఫియం సుజాతయుం’లో నటించే అవకాశం దొరికింది. ఐతే అది ఓటీటీలో విడుదలవడంతో దేవ్ కొంత నిరాశకు గురైనా తన నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడం ఆనందం వ్యక్తం చేశాడు.
సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ సినిమా ట్రైలర్ వచ్చేంతవరకూ ఎవ్వరికీ ఆ విషయం చెప్పనేలేదట. ఆ సినిమా ట్రైలర్ చూసి ‘ఈ చిత్రంలోని హీరో నీలానే ఉన్నాడు’ అంటూ పొగిడేవారు. దేవ్ మోహనే ఆ హీరో అని కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నారు. అలా తొలి ప్రయత్నంలోనే 2020లో విడుదలైన సూఫియుం సుజాతయుం’లో సూఫీ గురువుగా ఆయన నటన చూసి నిర్మాత గుణ నీలిమ ‘శాకుంతలం’లో దుష్యంతుడి పాత్రకు ఎంపిక చేసినట్లు దేవ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నటుడిగా కెరీర్ ప్రారంభమైన అనతి కాలంలోనే ఇతిహాస నేపథ్యమున్న శాకుంతలం వంటి చిత్రంలో నటించడం కొత్త అనుభవాన్ని ఇచ్చిందన్నారు. నిజానికి ఈ మువీలో సమంత కన్నా వయసులో దేవ్ మోహన్ ఐదేళ్లు చిన్నవాడు వాడు కావడం గమనార్హం. ‘సూఫియుం సుజాతయుం’, ‘హోమ్’, ‘పాత్రాండు’ ఈ మూడు చిత్రాల్లో నటించిన దేవ్ నాలుగో చిత్రం శాకుంతలంలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ తెరకెక్కించిన ‘శాకుంతలం’ ఈ నెల 14న విడుదలకాబోతుంది. అలాగే మలయాళంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘రెయిన్‌బో’లోనూ నటిస్తున్నాడు.