
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం (నవంబర్ 16) తుదిశ్వాస విడిచారు.

ఈ విషాద వార్త తెలియగానే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తమ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్ వచ్చేశారు. రామ్మూర్తి నాయుడికి నివాళులు అర్పించారు.

ఇక రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో అతని కుమారులు హీరో నారా రోహిత్, గిరీశ్ శోక సంద్రంలో మునిగిపోయారు. ముఖ్యంగా తండ్రి భౌతిక కాయాన్ని చూసి నారా రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇది గమనించిన చంద్ర బాబు రోహిత్, గిరిశ్ లను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.

రామ్మూర్తి నాయుడి భౌతిక కాయాన్ని ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు తరలించనున్నారు. ఆదివారం (నవంబర్ 17) అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇటీవల నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. నటి సిరి లెల్లతో త్వరలో వివాహబంధంలోకి అడుగు పెట్టుందుకు రోహిత్ రెడీ అయ్యాడు. ఇలాంటి సమయంలో అతని ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.