
టాలీవుడ్ మార్కెట్ కావాలనుకున్నపుడు.. వాళ్ల ఫోకస్ కూడా అదే రేంజ్‌లో ఉండాలి. ఏదో ఉన్నామంటే ఉన్నాం.. తిన్నామంటే తిన్నాం అన్నట్లు కాకుండా కాస్త ఫోకస్డ్‌గా ఉంటే తప్ప మన ఆడియన్స్ పట్టించుకోరు. ఈ విషయాన్ని ఇన్నాళ్లకు బాలీవుడ్ హీరోలు అర్థం చేసుకున్నారు. అందుకే తెలుగు మార్కెట్ కోసం వాళ్లు ఓ విషయంపై దృష్టి పెంచేసారు. మరి అదేంటో తెలుసా..?

సాధారణంగా మనం ఓ పాటను వింటున్నపుడే ఇది స్ట్రెయిట్ సాంగా లేదంటే డబ్బింగ్ పాటా అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే లిరిక్స్‌లో ఆ తేడా బాగా కనిపిస్తుంది కాబట్టి. అందుకే తమిళ హీరోలు తమ సినిమాల పాటలపై ఫోకస్ చేస్తుంటారు. తెలుగు లిరిక్స్ బాగా ఉండేలా చూసుకుంటారు. ఇదే రూట్ ఇప్పుడు బాలీవుడ్ హీరోలు ఫాలో అవుతున్నారు. వాళ్ల డబ్బింగ్‌పై మరింత ఫోకస్ చేస్తున్నారు.

తమిళ పాటల్లో సాహిత్యం బాగానే ఉంటుంది కానీ బాలీవుడ్ పాటలైతే మరీ దారుణంగా ఉంటాయి. ఏదో గూగుల్ ట్రాన్స్‌లేట్ చేసినట్లు అర్థం పర్థం లేకుండా సాగిపోతుంటాయి. కానీ మీకు ప్రాపర్ మార్కెట్ కావాలనుకున్నపుడు.. అన్నీ మ్యాటరే. అందుకే ఈ మధ్య షారుక్, సల్మాన్, రణ్‌బీర్ లాంటి హీరోలు.. తెలుగు లిరిక్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు.

మొన్న జవాన్ తెలుగు వర్షన్ పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. ఇంకా మాట్లాడితే ఒరిజినల్ కంటే తెలుగు, తమిళం లిరిక్స్ బాగున్నాయనే అప్రిషియేషన్ వచ్చింది. మరోవైపు యానిమల్ పాటలోని లిరిక్స్ కూడా బాగున్నాయి.

తాజాగా టైగర్ 3 పాటని డబ్బింగ్ పాటలా కాకుండా అర్థవంతంగా రాసారు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్. మొత్తానికి బాలీవుడ్ హీరోల్లో వచ్చిన ఈ మార్పే వాళ్లకిక్కడ మార్కెట్ పెంచేస్తుంది.