
ఓ వైపు ఎన్నికలేమో దగ్గరికి వచ్చేస్తున్నాయి.. ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉంది.. మరోవైపు తనపై భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. రెండింటికి న్యాయం చేయాలని చూస్తున్నారు బాలయ్య. దానికోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసారు. ఇటు రాజకీయాలు.. అటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తున్నారు.

అసలు NBK ఏం చేస్తున్నారో తెలుసా..?రాజకీయాల్లో ఉంటూ.. సినిమాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అదెంత కష్టమైన పనో పవన్ కళ్యాణ్‌ను చూస్తుంటే అర్థమైపోతుంది. కానీ బాలయ్య మాత్రం రెండింటినీ పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తున్నారు.

ఓ వైపు బాబీ సినిమా చేస్తూనే.. మరోవైపు రాబోయే ఎన్నికల కోసం తెలుగుదేశం తరఫున తనవంతు బాధ్యత పూర్తి చేస్తానంటున్నారు NBK. ఏపీలో ఎన్నికల వేడి ఎక్కువైపోవడంతో బాబీ సినిమాకు రెండు నెలలు బ్రేక్ ఇవ్వాలనుకున్నారు బాలయ్య. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చుకున్నారు.

ముందు బాబీ సినిమాను వీలైనంత పూర్తి చేసి.. ఆ తర్వాత ఎన్నికలపై ఫోకస్ చేయాలనుకుంటున్నారు నటసింహం. ఈ క్రమంలోనే మరో 15 రోజులు NBK 109 సెట్‌లోనే ఉండబోతున్నారు బాలయ్య. బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్, బాబీ డియోల్ లాంటి స్టార్స్ ఉన్నారు.

అలాగే దసరా విలన్ షైన్ టామ్ చాకో సెట్‌లో జాయిన్ కానున్నారు. మార్చి మొత్తం NBK109 సెట్‌లోనే ఉండి.. ఎప్రిల్ నుంచి ఎన్నికలపై ఫోకస్ చేయాలని చూస్తున్నారు బాలయ్య. మొత్తానికి కాస్త ఫ్రీ టైమ్ దొరికినా.. ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నారు ఈ సీనియర్ హీరో.