
ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై సత్తా చాటుతోన్న నటీమణుల్లో పూర్ణ అలియాస్ షమ్నా కాసీమ్ ఒకరు. గతంలో పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్పెషల్ రోల్స్‌లో సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. అలాగే ఢీ లాంటి డ్యాన్సింగ్ రియాలిటీ షోల్లోనూ కనిపిస్తోంది.

ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న పూర్ణ ఇటీవలే అమ్మగా ప్రమోషన్ పొందింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ పిల్లాడి ఆలనాపాలనతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

కాగా న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది పూర్ణ. ప్రతినాయకుడి భార్యగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమాయంలో తాను గర్భంతో ఉన్నానని, షూట్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పూర్ణ తెలిపింది.

సినిమాలో చాలా సన్నివేశాలు రాత్రివేళల్లోనే షూట్ చేశారని, విపరీతమైన చలికారణంగా బాగా ఇబ్బందులు పడ్డానని చెప్పుకొచ్చింది పూర్ణ. పైగా చల్లగా ఉన్న నీళ్లు తీసుకోవడం మరింత సమస్యలు తెచ్చిపెట్టిందని గుర్తుతెచ్చుకుందీ అందాల తార.

అలాగే మరో సీన్‌లో రాత్రిపూట నిర్మానుష్యమైన రోడ్డులో పరుగెత్తాల్సి వచ్చిందని అప్పుడు వీధికుక్కల అరుపులు విని భయపడ్డానంది పూర్ణ. అయితే అదృష్టవశాత్తూ అవి తనను కరచలేదని పూర్ణ తెలిపింది. ఆ సన్నివేశంలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తానని దసరా షూటింగ్ అనుభవాలను పంచుకుంది పూర్ణ.